రిజర్వేషన్ల నిర్ణయం చరిత్రాత్మకం
ముంబై: మరాఠాలకు, ముస్లింలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం, విప్లవాత్మకం అని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ఆరిఫ్ నసీమ్‌ఖాన్ పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలలో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
దీనిపై మంత్రి ఆరిఫ్ గురువారం స్పందిస్తూ సామాజికంగా, ఆర్థికంగా, విద్యపరంగా ముస్లింలు వెనుకబడి ఉన్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన సచార్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ రహమాన్ బృందం కూడా ఇవే విషయాలను ఎత్తి చూపాయని ఆరిఫ్ పేర్కొన్నారు. రిజర్వేషన్ సదుపాయం వల్ల ముస్లిమ్‌లు సామాజికంగా, ఆర్థికంగా సాధికారత పొందగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చట్టబద్ధంగానే రిజర్వేషన్లు : ఎన్సీపీ
చట్టపరమైన అన్ని అంశాలను పరిశీలించిన మీదటనే మరాఠాలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నామని ఎన్సీపీ తెలిపింది. తమ నిర్ణయం న్యాయస్థానాల్లో కూడా నెగ్గుకు రాగలదని ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ-సేన కూటమి తమ నిర్ణయానికి పాక్షికంగా మద్దతు తెలిపాయని, అయితే అవి పరోక్షంగా ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకొనేందుకు ప్రయత్నించవచ్చని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసే అవకాశం ఉందని మాలిక్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వీజేఎన్టీ గిరిజనులకు 52 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. వీటికి తోడు ప్రభుత్వం తాజాగా మరాఠాలకు 16 శాతం, ముస్లిమ్‌లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. రాజకీయంగా ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న మరాఠాలు, ముస్లిమ్‌లకు 21 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మొత్తంగా ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 73 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు అయింది. ఈ నిర్ణయం రాజకీయ ఉద్దేశాలతోనో లేక ఎన్నికల నేపథ్యంలోనో తీసుకున్నది కాదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.