Minority boarding school
-
మైనార్టీ బాలుర గురుకులంలో కలకలం!
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): హుజూరాబాద్‌లోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి నలుగురు వి ద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ అర్బన్ జిల్లా వంగర గ్రామ పరిధిలోని పీవీ నగర్‌కు చెందిన షేక్ అక్తర్, షేక్ రఫీ, షేక్ ఇజ్రాయిల్, షేక్ షకిల్ హుజూరాబాద్‌లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. గురువారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచి పాఠశాల గోడ దూకి పారిపోయారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించగా వారు పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలోని సీసీ కెమెరా పుటేజీలను సీఐ మాధవి పరిశీలించగా వేకువజామున 5.20 గంటల సమయంలో వెళ్లినట్లు, వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా విద్యార్థులు కాలినడకన వెళ్లినట్లుగా గుర్తించారు. మధ్యాహ్నం ఇప్పల్‌నర్సింగాపూర్ సమీపంలోని తాటి వనం నుంచి విద్యార్థులు కాలి నడకన వెళ్తున్నట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ప్రిన్సిపాల్ సార్ కొట్టడంతోనే స్కూల్ నుంచి పారిపోయామని విద్యార్థులు సీఐ మాధవికి వివరించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ తెలిపారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
హాస్టల్లో ఇమడలేక.. బిల్డింగ్‌పై నుంచి దూకాడు
- విద్యార్థి తలకు బలమైన గాయాలు.. ఉస్మానియాలో చికిత్స - ఆగాపురా గురుకులంలో ఘటన.. ఆందోళనలో విద్యార్థులు హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆరో తరగతి చదివే ఓ విద్యార్థి గురుకులం మూడో అంతస్తు నుంచి కిందికి దూకడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగాపురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. ఆగాపురాలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు నాంపల్లి దర్గాషా ఖామూస్ ప్రాంతానికి చెందిన అయేష్ అనే ఆరో తరగతి విద్యార్థి హాస్టల్ వాతావరణంలో ఉండలేక మూడో అంతస్తు నుంచి కిందికి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. సెంట్రల్ కేఫ్ ఎదురుగా ఉన్న ఇసుకలోకి దూకేందుకు యత్నించగా పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో విద్యార్థి తలకు బలమైన గాయాలయ్యాయి. అయేష్ను తొలుత ఏరియా ఆసుపత్రికి.. అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రారంభమైన రోజే.. మైనార్టీ గురుకుల విద్యాలయం ప్రారంభమైన రోజే ఇమ్రాన్, అక్రమ్ అనే ఇద్దరు విద్యార్థులు భవనం రెండో అంతస్తు నుంచి పక్కింటి మేడ మీదకు దూకారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పక్కింటి యజమానులు విద్యార్థులను పట్టుకుని హాస్టల్లో అప్పగించారు. బుధవారం నాటి ఘటనతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురుకులానికి చేరుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. హాస్టల్లోని విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో సంబంధిత అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు బలగాలను మొహరించారు. ఈ ఘటనపై మైనార్టీ శాఖ ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించారు.