ఎన్సీపీ ప్రక్షాళన ప్రారంభం
- రాష్ట్ర, నగర అధ్యక్షులను మార్చాలని నిర్ణయం
- మైనార్టీ నేత నవాబ్ మాలిక్‌కు ముంబై పగ్గాలు
- బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కీలక మార్పులు
సాక్షి, ముంబై: పార్టీ ప్రక్షాళన దిశగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధిష్టానం అడుగులేస్తోంది. రాష్ట్ర, ముంబై రీజియన్ అధ్యక్షులను మార్చాలని సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ముంబై రీజియన్ అధ్యక్ష పదవిలో ప్రస్తుత పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్‌ను నియమించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్ష పదవి కోసం దిలీప్ వల్సే పాటిల్, మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చాయి. నగరంలో బుధవారం జరగనున్న సమావేశంలో ఎన్సీపీ కార్యవర్గ విస్తరణ జరగనుంది.
ఇందులో ముంబై రీజియన్ అధ్యక్షుడిగా మలిక్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు 25 స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. దీంతోృబహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఒవైసీ ప్రకటనతో అప్రమత్తమైన ఎన్సీపీ.. భవిష్యత్ సమస్యల పరిష్కారానికి ఇప్పుడే పార్టీ ప్రక్షాళన చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో ముంబైలోని మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు నగర పార్టీ పగ్గాలను నవాబ్ మలిక్ కట్టబెట్టాలని ఎన్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఎన్సీపీ దెబ్బకు డీలా..
గత వారం జరిగిన ఔరంగాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం కారణంగా ఎన్సీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఎన్సీపీ 70 స్థానాల్లో పోటీచేయగా కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే చోట ఎంఐఎం 53 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 25 స్థానాలు గెలుచుకుని ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ముంబైలో ఎన్సీపీ బలం అంతంత మాత్రమే ఉంది. ఇటువైపు ఉత్తరాది ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ నిరుపంకు ముంబై రీజియన్ పగ్గాలు కట్టబెట్టింది.
ఇదే తరహాలో మైనార్టీలను ఆకర్షించేందుకు ఎన్సీపీ ముంబై రీజియన్ అధ్యక్ష పదవి బాధ్యతలు నవాబ్ మాలిక్‌కు అప్పగించనుంది. నవాబ్కు ఉత్తరాది, మైనార్టీలతో మంచి సంబంధాలున్నాయి. ఈ నెల 11న బాంద్రా తూర్పు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రాణేకు ముస్లిం ఓట్లు పోలవడానికి నవాబ్ మలిక్ కారణమని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. అలాగే ఎన్సీపీ మహిళ ప్రదేశ్ అధ్యక్ష పదవిలో చిత్రా వాఘ్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. దీనికి బుధవారం ఆమోద ముద్ర వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.