చోరీల కోసం... ఎలక్ట్రీషియన్ వేషం
రాంగోపాల్‌పేట, న్యూస్‌లైన్: ఎలక్ట్రీషియన్ వేషంలో వెళ్లి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ పాతనేరస్తుడిని మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి వద్ద నుంచి చోరీ సొత్తును కొంటున్న వ్యక్తిని కూడా కటకటాల్లోకి నెట్టారు. నిందితుల నుంచి మొత్తం ఒక కేజీ 25 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో డీసీపీ జయలక్ష్మి, అదనపు డీసీపీ పీవై గిరి, ఏసీపీ మహేందర్ వివరాలు వెల్లడించారు.
టోలిచౌకీకి చెందిన మిర్ ఖాజం అలీఖాన్ (22) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు మొదలెట్టాడు. గతంలో నారాయణగూడ, షాహినాయత్‌గంజ్, ఎస్సార్‌నగర్. పంజగుట్ట, సుల్తాన్‌బజార్, గోల్కొండ, హుమాయూన్‌నగర్, బేగంబజార్, రాజేంద్రనగర్, కూకట్పల్లి ఠాణాల పరిధుల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి బయటకు రాగానే తిరిగి మారేడుపల్లి, తుకారాంగేట్, నల్లకుంట, అంబర్పేట్, ఎస్సార్‌నగర్, బేగంపేట్, రాంగోపాల్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హూమాయూన్నగర్ ఠాణాల పరిధుల్లో 14 చోరీలు చేశాడు.
ఇటీవల బేగంపేట, హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో జరిగిన దొంగతనాల కేసుల్లో నిందితుడి వేలిముద్రలు సరిపోవడంతో.. పోలీసులు నిఘా ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు మారేడుపల్లి ఇన్స్పెక్టర్ శశాంక్‌రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ నరహరి, ఎస్సై కిశోర్‌లు పక్కా వ్యూహంతో నిందితున్ని అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి చోరీ సొత్తు కొంటున్న టోలిచౌకీకి చెందిన మహ్మద్వ్రూఫ్ను కూడా రిమాండ్‌కు తరలించారు.
ఎలక్ట్రీషియన్‌గా వెళ్లి..
తలకు క్యాప్, భుజాన బ్యాగుతో టూవీలర్‌పై దొంగతనం చేయాలనుకునే అపార్ట్మెంట్ వద్దకు వెళ్తాడు. లోనికి వెళ్లేముందు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేస్తాడు. సెక్యూరిటీ సిబ్బందికి ఎలక్ట్రీషియన్‌నని చెప్తాడు. పేరు, సెల్ నెంబర్లు తప్పువి చెప్పి.. అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. తాళం వేసి ఉన్న ఫ్లాట్ గుర్తించి.. తాళాలు పగులగొట్టి సొత్తుతో పరారవుతాడు.
పట్టుకోవాలంటే తిప్పలే...
అరెస్టుకు ముందే అలీఖాన్ తన బంధువు ద్వారా కోర్టులో కేసులు వేసి పోలీసులను తిప్పలు పెడతాడు. అరెస్టు సందర్భంలో తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి పోలీసుల రాకను నిత్యం గమనిస్తుంటాడు.