సహారా రాయ్‌కు మరో సంకటం
మిరాచ్ 40 కోట్ల డాలర్ల పరువునష్టం దావా!
న్యూయార్క్: సహారా గ్రూప్‌పై మిరాచ్ కేపిటల్ 40 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2,500 కోట్లు) పరువునష్టం దావా వేయనుంది. ఇందుకు సంసిద్ధం అవుతున్నట్లు సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సహారాతో ఒప్పందం బెడిసికొట్టిన నేపథ్యం- తమ సంస్థ పేరు ప్రతిష్టలను, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని మిరాచ్ కేపిటల్ ఆరోపించింది. వివరాల్లోకి వెళితే... తమ చీఫ్ సుబ్రతోరాయ్ బెయిల్ వ్యవహారంలో రూ.10,000 కోట్ల నిధులను సమకూర్చుకోడానికి ప్రయత్నిస్తున్న సహారా- విదేశాల్లో ఉన్న తమ మూడు హోటళ్ల విక్రయానికి మిరాచ్ కేపిటల్‌తో 2.05 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో బ్యాంకర్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉన్నట్లు మిరాచ్ కేపిటల్ తమకు తెలిపిందని సుప్రీంకోర్టుకు సహారా గ్రూప్ తెలిపింది. అయితే ఈ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని బ్యాంక్ ప్రకటించడంతో సహారా-మిరాచ్ మధ్య వివాదం ప్రారంభమైంది. తమను మిరాచ్ తీవ్రంగా మోసపుచ్చిందనీ, దీనికిగాను క్రిమినల్ కేసును దాఖలు చేసినట్లు సహారా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిరాచ్ కేపిటల్ కూడా తాజాగా సహారా గ్రూప్‌పై న్యాయ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.