రంగమేదైనా పట్టుదల అవసరం
సినీనటుడు ఫిష్ వెంకట్
కాజీపేట : పని చేయాలనే తపన, సాధించాలనే పట్టుదలతో కార్యాచరణలోకి దిగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సినీ హాస్యనటుడు మంగిళిపల్లి(ఫిష్) వెంకట్ అన్నారు. అత్యాధునిక వసతులతో కాజీపేటలో ప్రారంభమైన మిరాకిల్ సిజర్స్ బ్యూటీపార్లర్ వంద రోజుల వేడుకలను శనివారం వెంకట్ ప్రారంభించారు. పార్లర్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువత ముందుకుసాగాలన్నారు.
పేద కుటుంబంలో పుట్టిన హరికృష్ణ..మిత్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారంతో జావేద్ హబీబ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుని కాజీపేటలో బ్యూటీపార్లర్ స్థాపించడం అభినందనీయమన్నారు. కులవృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు మరింతగా రాయితీలు ఇచ్చి యువతను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు. అనంతరం ఫిష్ వెంకట్‌ను మిరాకిల్ సిజర్స్ సంస్థ డెరైక్టర్ కొత్తపల్లి హరికృష్ణ శాలువ, మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలకంటి శ్రీనివాస్, ఆర్.లక్ష్మణ్ సుధాకర్, కొండా అశోక్ యాదవ్, ఎస్పీ ప్రభాకర్, కొత్తపల్లి సదానందం, శివకృష్ణ, వెంకటకృష్ణ, భద్రయ్యగౌడ్ పాల్గొన్నారు.
‘ఆది’ సినిమాతోనే గుర్తింపు
- ఫిష్ వెంకట్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాతో సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు వచ్చిందని హాస్యనటుడు ఫిష్ వెంకట్ అన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం కాజీపేట వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఒరేయ్.. తమ్ముడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాను ఇప్పటి వరకు 90 సినిమాల్లో నటించానని చెప్పారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో గంగపుత్ర కుటుంబంలో పుట్టిపెరిగిన తాను మూడో తరగతి వరకే చదువుకున్నానని తెలిపారు. సినిమాల్లో చాలామంది వెంకట్లు ఉండడంతో తనను సులభంగా గుర్తుపెట్టుకునేందుకు ఫిష్ వెంకట్‌గా పిలిచేవారని, తర్వాత అదే పేరు స్థిరపడిపోయిందన్నారు. తనతో విలక్షణమైన పాత్రలు చేయిస్తూ ప్రోత్సహిస్తున్న దర్శకుడు వీవీ వినాయక్ తనకు గాడ్‌ఫాదర్ అన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మిత్రుడు దివంగత శ్రీహరిని ఏనాడూ మర్చిపోలేనన్నారు. హీరోగా చేసేందుకు రెండు సినిమాలు ఒప్పుకున్నానని, ఈ ఏడాదే అవి ప్రారంభం కావొచ్చని వెల్లడించారు. సినీ ప్రపంచం పైకి బాగానే కనిపిస్తుందని కానీ అందులోనూ బోలెడన్ని బాధలుంటాయని వెంకట్ తెలిపారు. తనకు బాగా నచ్చిన ప్రాంతం వరంగల్ అని, ఇక్కడ తనకు ఎందరో మిత్రులు ఉన్నారని చెప్పే వెంకట్ తను నటించిన నాలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.