వ్యవసాయ శాఖ కేంద్రంగా చల్గల్
అనుబంధశాఖల విలీనం
కొత్తజిల్లాలో రైతు సేవలన్ని ఒకే చోట?
జగిత్యాల అగ్రికల్చర్ : జగిత్యాల జిల్లాలో చల్గల్ వ్యవసాయ క్షేత్రం అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు, సిబ్బంది నియామకానికి ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు ఇతర శాఖల కార్యాలయాల ఏర్పాటు కోసం కూడా అన్వేషిస్తున్నారు. ముఖ్యమైన శాఖల అనుబంధ శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడంతో శాఖల విలీనం దాదాపు ఖాయమైనట్లే భావిస్తున్నారు.
చల్గల్ కేంద్రంగా వ్యవసాయ అనుబంధ శాఖల విలీనం?
వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన, మత్స్య , సూక్ష్మ సేద్య విభాగం, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, అగ్రో ఇండస్ట్రీస్, సీడ్ కార్పొరేషన్, భూసార పరీక్ష కేంద్రాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్నారు. అలా జరిగితే ఇవన్నీ జిల్లాలో ఒకే అధికారి అధీనంలో పనిచేయనున్నాయి. దీంతో రైతులకు మేలు జరుగుతుందని, కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
జగిత్యాల జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖల కేంద్రంగా చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాన్ని మార్చనున్నారు. దాదాపు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్షేత్రంలో భవనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. జగిత్యాల పట్టణానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ దారిలో ఉన్న ఈ క్షేత్రంలోని భవనాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలను ఒకేచోట చేరిస్తే దాదాపు 100 నుంచి 150 మంది ఉద్యోగులు ఒకేచోట పనిచేసే అవకాశముంది. విశాలమైన భవనాలు ఉండడంతో ఎరువులు, విత్తన పరీక్ష కేంద్రాలు, బయోలాజికల్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కూడా అవకాశముంది. వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న మార్కెట్ కార్యాలయం, మామిడి మార్కెట్‌తో రైతులకు మరింత మేలు జరుగుతుంది.