అద్దాల మండపంలో రామయ్య
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాద్రి రామాలయంలో రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన అద్దాల మండపాన్ని శనివారం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అనంతరం రాజాధిరాజు సీతారామచంద్రస్వామి ఆ మండపంలో కొలువుదీరారు. మండపంలో స్వామివారికి అర్చకులు ఊంజల్ సేవ నిర్వహిస్తుండగా అద్దాలలో స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ఆ తర్వాత దర్బారు సేవలో భాగంగా స్వామి వారికి ఆస్థాన హరిదాసులు కీర్తనలు ఆలపిస్తుండగా అర్చకులు ‘డోలోత్సవం’ నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారు వేంచేసి ఉన్న మండపం వద్ద స్వామి వారికి ఊంజల్ సేవ నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు తెలిపారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం స్వామి వారికి ఈ మండపంలోనే డోలోత్సవం(ఊంజల్‌సేవ) నిర్వహిస్తామని చెప్పారు. డోలోత్సవం తర్వాత స్వామి వారికి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు.
శాస్తోక్తంగా కలశ పూజలు..
అద్దాల మండపం ప్రారంభానికి ముందుగా.. ఆ మండపంలో ఏర్పాటు చేయనున్న కలశాన్ని యాగశాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనితో పాటు లక్ష్మి అమ్మవారికి చేయించిన మకరతోరణాన్ని, బంగారు మలామాతో తయారు చేయించిన అమ్మవారి కమలాలను, అభయ వరద హస్తాలను యాగశాలలో ఉంచి సంప్రోక్షణ గావించారు.
అనంతరం మేళతాళాల మధ్య ఆలయ అర్చకులు గలంతికా కంభం చేపట్టి జలాన్ని ధారగా పోస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి అద్దాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం అద్దాల మండపానికి సంప్రోక్షణ గావించారు. ఆ తర్వాత కూర్చ(దర్భలతో తయారు చేసినది)కు ఛాయా, జలాధి, పంచగణ్యాధి, పంచతల్వాదివాసాలను అవాహనం చేశారు. ఆ కూర్చను మండపంలోని ఈశాన్య ప్రాంతంలో ప్రతిష్ఠించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ఈఓ రఘునాధ్, ఆలయ అర్చకులు కలశస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు సన్యాసిశర్మ, గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.