తాగితే 10 వేలు.. అమ్మితే 20 వేలు..
చిన్నశంకరంపేట (మెదక్): మద్యం బాబుల ఆగడాలను అరికట్టేందుకు ఆ గ్రామస్తులు నడుం బిగించారు. మద్యపాన నిషేధం కోసం అందరూ ఏకమయ్యారు. మద్యం క్రయవిక్రయాలను నిషేధించారు. మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా, బహిరంగంగా తాగితే రూ.10 వేల జరిమానాగా వసూలు చేయాలని తీర్మానించారు.
వివరాలు.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని కిరాణం దుకాణాల్లో విచ్చలవిడిగా మందు తాగి కొందరు గొడవలకు దిగుతున్నారు. ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులంతా ఏకమై మద్యపానాన్ని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చారు.
బుధవారం 'గ్రామజ్యోతి' గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో మద్యం నిషేధ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షురాలిగా గ్రామ సర్పంచ్ కర్రె నర్సమ్మ, కన్వీనర్‌గా ఎంపీపీ అధ్యక్షురాలు కర్రె కృపావతితో పాటు మరో 23 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించరాదని ఈ సందర్భంగా నిర్ణయించారు. గ్రామసభ తీర్మానాన్ని కాదని ఎవరైనా మద్యం అమ్మితే రూ.20 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలో ఎవరైనా బహిరంగంగా మద్యం తాగినా, తాగి వచ్చి అల్లరి చేసినా రూ.10 వేల జరిమానా విధించాలని ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆ మేరకు తయారైన తీర్మానంపై గ్రామస్తులు, కిరాణ షాపుల యజమానులు సంతకాలు చేశారు.