ఉపాధ్యాయుల వేధింపులపై డెప్యూటీ సీఎంకు ఫిర్యాదు
గోవర్ధనగిరి పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో
హుస్నాబాద్రూరల్: చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు డెప్యూటీ సీఎంకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఏజేసీ అదేశాల మేరకు డీఈవో శ్రీనివాసాచార్యులు సోమవారం హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి పాఠశాలను తనిఖీ చేశారు. సర్పంచ్ పాక శ్రీనివాస్, ఎంపీటీసీ పెండ్యాల రమ సమక్షంలో విచారణ చేపట్టారు. అలాంటివి ఏమి లేవని, వారం రోజుల క్రితం 9వ తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయుడు వేధించాడని సమాచారంతో అమ్మాయి తండ్రి సమక్షంలోనే మందలించి వదిలేసినట్లు తెలిపారు. అంతకుమించి ఎలాంటి సమస్యలు లేవని ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా ఇచ్చారు. విద్యార్థినులు సైతం వారి అభిప్రాయాలు రాసి ఇచ్చారు. వేధింపులకు గురైన విద్యార్థిని నుంచి అభిప్రాయం తీసుకోకుండా మధ్యహ్నం పాఠశాల నుంచి ఇంటికి పంపించి ఆమె తండ్రి అభిప్రాయం తీసుకోవడం విశేషం.
గురువుల ప్రవర్తన మారాలి
పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయుల ప్రవర్తన మారాలని, విద్యార్థులకు విద్యా బోధనకు సమయం కేటాయించకుండా సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు డీఈవోకు వివరించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే గతేడాది పదోతరగతి పలితాలు రాలేదన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయుల కార్లు, వాహనాలను శుభ్రం చేయిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఈవో ఆనందం, ఎంఈవో అర్జున్, పీజీ హెచ్ఎంలు అల్లెంకి రవీందర్, సమ్మిరెడ్డి, సర్పంచ్ పాక శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు పెండ్యాల రమ, ఎస్ఎంసీ చైర్మన్ సారయ్య తదితరులు ఉన్నారు.