న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. కొత్త ట్రెండ్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వాలే దుష్ప్రచారం సాగిస్తుండడం దురదృష్టకరం, ఇదొక కొత్త ట్రెండ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇష్టంలేని తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి అమన్‌కుమార్ సింగ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ చత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ ఆదేశాలు సవాలు చేస్తూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం, ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘మీ పోరాటం మీరు చేసుకోండి. కానీ కోర్టులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివి చూస్తున్నా. జడ్జీలపై ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇదొక కొత్త ట్రెంట్‌గా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.