స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం
పిల్లలతో వస్తుండగా ఊడిన టైర్లు
48 మంది విద్యార్థులు క్షేమం
జగ్గయ్యపేట: ఓ కార్పొరేట్ పాఠశాలకు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వస్తుండగా మార్గమథ్యంలో వెనుకనున్న ఒకపక్క టైర్లు ఊడిపోయాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన ఈ బస్సు శుక్రవారం ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలు, పేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 48 మంది విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్కు వస్తోంది. పేట మండలం రామచంద్రునిపేటకు వచ్చాక బస్సు పెద్దశబ్దం వచ్చి ఆగిపోయింది.
దీంతో విద్యార్థులు ఆందోళన చెంది కేకలు వేశారు. డ్రైవర్, క్లీనర్ కిందకు దిగి చూడగా, బస్సు వెనుకవైపు టైర్లు ఊడిపోయాయి. గ్రామస్తులు స్పందించి పిల్లలను బస్సులో నుంచి కిందకు దించారు. వారికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.