mission anthyodaya
-
గ్రామాల్లో మిషన్ అంత్యోదయ సర్వే
సాక్షి, నిజామాబాద్: పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు, ఆ పల్లెల వికాసమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ అంత్యోదయ క్రింద ‘సబ్కీ యోజన సబ్కా వికాస్’అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ వారిగా కార్యదర్శులు 29 అంశాలలో సర్వే చేస్తున్నారు. నెలాఖరులోగా సమగ్ర సమాచారం సేకరించి ప్రత్యేక యాప్‌లో డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వే తీరు తెన్నులపై ప్రత్యేక కథనం.. అన్ని శాఖల సమన్వయంతో.. కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలు, గ్రామ పంచాయతీల అభి వృద్ధే ధ్యేయంగా అడుగు వేస్తోంది. అందులో ప్రధానంగా పేదరిక నిర్మూలన, మౌళిక వసతు ల కల్పన, మెరుగైన రవాణా, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది. మరేమి అభివృద్ధి జరిగాలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో ప్రజల భాగస్వా మ్యం వంటి అంశాలను తెలుసుకోవడానికి మిషన్ అంత్యోదయ సర్వే చేపడుతుంది. ఇందు లో బాగంగా 29 అంశాలకు చెందిన సమగ్ర సమాచారం తెలిసేలా 146 ప్రశ్నలను రూపొందించారు. ఆయా ప్రశ్నల సమాధానాలతో మిషన్ అంత్యోదయ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 1062 గ్రామ పంచాయతీల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సేకరిస్తున్న అంశాలివే.. సర్వేను పార్ట్–ఏ, పార్ట్–బీ విభాగాలుగా విభజించి సర్వే చేస్తున్నారు. పార్ట్ ఏలో నియోజక వర్గం, జనాభా, గృహాలు వంటి ప్రాథమిక సమచారంతో మొదలయ్యే సర్వేలో వ్యవసాయం, చిన్న నీటి వనరులు, భూ అభివృద్ధి, పశుసంవర్థక, మత్స్య, ఇంటి నిర్మాణం, తాగునీరు, రహదారులు, విద్యుత్, సామాజిక ఆస్తుల వివరాలు, భూ వివరాలు, లైబ్రరీ, అందుబాటులో ఉన్న బ్యాంకులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, రవాణా, విద్యా సౌకర్యం, మార్కెటింగ్, ఆరోగ్యం, పారిశుధ్యం, మహిళా శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఖాదీ, చేనేత, పరిశ్రమలు, సామాజిక అటవీ విభాగంచిన్న తరహా పరిశ్రమలు మొదలైన అంశాలు, పార్ట్ బీలో నమోదు చేస్తున్నారు. సమగ్ర, సమాచార సేకరణలో పల్లె వికాసానికి మరేం చేయాలో స్పష్టత రానుంది. మిగిలింది 11రోజులే.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1062 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,334 గ్రామాలు కలవు. డిసెంబర్ 16 నాటికి 856 గ్రామ పంచాయతీలు మిషన్ అంత్యోదయ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగా 73 గ్రామ పంచాయతీలు మాత్రమే సర్వేను పూర్తి చేశాయి. రూపొందించిన సర్వే ఆధారంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. గ్రామ కార్యదర్శులు పారదర్శకంగా సర్వే వివరాలు నమోదు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సర్వే నత్తనడకన కొనసాగుతోంది. కొందరు గ్రామ కార్యదర్శులు కూర్చున్నచోటు నుండే సెల్‌ఫోన్ ద్వారా సమాచారం సేకరించి నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందుతున్నాయన్న సమాచారం కూడా పక్కాగా నమోదు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచాలి గ్రామ పంచాయతీల పరిధిలో 29 అంశాల్లో చేస్తున్న సర్వే ద్వారా ప్రతి గ్రామం యొక్క అభివృద్ధి వివరాలు తెలుస్తాయి. సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచి చర్చించాలి. సర్వే వివరాలు పారదర్శకంగా నమోదు చేస్తే వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు పెట్టుకోవచ్చు. – పెద్ది మురళి, యుఎఫ్ ఆర్టీఐ జిల్లా కనీ్వనర్ -
ఇక ‘మిషన్ అంత్యోదయ’
♦ నూతన పథకానికి తెరతీసిన ప్రభుత్వం ♦ జిల్లాలో 200 గ్రామాలు ఎంపిక ♦ పేదరిక నిర్మూలనకు చర్యలు ♦ ఆదాయ వనరులు పెంచేందుకు కృషి పథకం మంచిదే.. ఆచరణే ప్రశ్నార్థకం మిషన్ అంత్యోదయ ద్వారా గ్రామాలు అభివృద్ధి చేయడం శుభపరిణామమే. అయితే ఇప్పటికే గ్రామాల్లో ఏ పనిచేసినా తమకు చెప్పకుండా చేస్తే ఊరుకునేది లేదని జన్మభూమి కమిటీల ముసుగులో తెలుగు తమ్ముళ్లు అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మిషన్ అంత్యోదయ పథకం ఆశించిన ఫలితాలు సాధిస్తుందో లేదో చూడాల్సిందే. ఏలూరు (మెట్రో) : పల్లెల్లో ఆదాయ వనరులు పెంచి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘మిషన్ అంత్యోదయ’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజలకు అన్ని వసతులు కల్పించడంతో పాటు పేదరిక నిర్మూలన కోసం వారు ఆదాయాన్ని పెంచుకునే విధంగా మార్గాలను దరి చేర్చాలన్నది మిషన్ అంత్యోదయ ఉద్దేశం. ఈ పథకం ద్వారా జిల్లాలో 200 గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంపూర్ణ అభివృద్ధిని సాధించాలన్న దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని విడతల వారీగా ఇతర గ్రామాలను ఎంపిక చేసి అభివృద్ధికి పట్టం కట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించడం ద్వారా పేదరికం లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని తీర్మానం చేయాలి. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ సూక్ష్మ ప్రణాళికను తయారు చేసి అమలు చేయడంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. మానవ వనరులు, సంస్థలను గుర్తించి మిషన్ అంత్యోదయ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎంపిక చేసిన గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం కుటుంబ, గ్రామ వికాసాలు లక్ష్యంగా పలు పథకాలను అమలు చేయనున్నారు. దీనికి వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ప్రతి కటుంబానికీ నెలకు రు.10 వేలు ఆదాయం వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో భరోసా కల్పిస్తారు. గ్రామాల్లో వ్వవసాయాన్ని రైతలకు లాభసాటిగా మార్చేందుకు భూసార పరీక్షలు, వర్మీకంపోస్టు యూనిట్లు, ఉద్యాన పంటల సాగు, పశుగ్రాసాల పెంపకం, ఎన్టీఆర్ జలసిరి, సాగునీటి సదుపాయాల కల్పన, భూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. గ్రామాల్లో కూలీలకు మరింత చేయూతనందించి ఆర్థిక ఆసరా కల్పించేందుకు ఉపాధి హామీ పథకంలో పంట కుంటల తవ్వకం, చెరువుల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టనున్నారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువతకు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ నైపుణ్య, కార్పొరేట్ సంస్థలు, విశ్వవిద్యాలయాల సహకారంతో స్వయం ఉపాధి పొందేలా చేస్తారు. మరికొన్ని అభివృద్ధికి బాటలు : గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తారు. అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం చేపడతారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, ఇంకుడుకుంతల తవ్వకం, సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసి పంచాయతీల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. అంతే కాకుండా పాఠశాల్లో వందశాతం విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, క్రీడా మైదానాల అభివృద్ధి చేస్తారు.