ఇక ‘మిషన్‌ అంత్యోదయ’ | state govt starts mission anthyodaya scheam in west godavari district | Sakshi
Sakshi News home page

ఇక ‘మిషన్‌ అంత్యోదయ’

Published Thu, Aug 31 2017 11:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ఇక ‘మిషన్‌ అంత్యోదయ’ - Sakshi

ఇక ‘మిషన్‌ అంత్యోదయ’

నూతన పథకానికి తెరతీసిన ప్రభుత్వం
జిల్లాలో 200 గ్రామాలు ఎంపిక
పేదరిక నిర్మూలనకు చర్యలు
ఆదాయ వనరులు పెంచేందుకు కృషి


పథకం మంచిదే.. ఆచరణే ప్రశ్నార్థకం మిషన్‌ అంత్యోదయ ద్వారా గ్రామాలు అభివృద్ధి చేయడం శుభపరిణామమే. అయితే ఇప్పటికే గ్రామాల్లో ఏ పనిచేసినా తమకు చెప్పకుండా చేస్తే ఊరుకునేది లేదని జన్మభూమి కమిటీల ముసుగులో తెలుగు తమ్ముళ్లు అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మిషన్‌ అంత్యోదయ పథకం ఆశించిన ఫలితాలు సాధిస్తుందో లేదో చూడాల్సిందే.

ఏలూరు (మెట్రో) : పల్లెల్లో ఆదాయ వనరులు పెంచి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘మిషన్‌ అంత్యోదయ’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజలకు అన్ని వసతులు కల్పించడంతో పాటు పేదరిక నిర్మూలన కోసం వారు ఆదాయాన్ని పెంచుకునే విధంగా

మార్గాలను దరి చేర్చాలన్నది మిషన్‌ అంత్యోదయ ఉద్దేశం. ఈ పథకం ద్వారా జిల్లాలో 200 గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంపూర్ణ అభివృద్ధిని సాధించాలన్న దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని విడతల వారీగా ఇతర గ్రామాలను ఎంపిక చేసి అభివృద్ధికి పట్టం కట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించడం ద్వారా పేదరికం లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని తీర్మానం చేయాలి. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ సూక్ష్మ ప్రణాళికను తయారు చేసి అమలు చేయడంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. మానవ వనరులు, సంస్థలను గుర్తించి మిషన్‌ అంత్యోదయ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

ఎంపిక చేసిన గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం కుటుంబ, గ్రామ వికాసాలు లక్ష్యంగా పలు పథకాలను అమలు చేయనున్నారు. దీనికి వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ప్రతి కటుంబానికీ నెలకు రు.10 వేలు ఆదాయం వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో భరోసా కల్పిస్తారు. గ్రామాల్లో వ్వవసాయాన్ని రైతలకు లాభసాటిగా మార్చేందుకు భూసార పరీక్షలు, వర్మీకంపోస్టు యూనిట్లు, ఉద్యాన పంటల సాగు, పశుగ్రాసాల పెంపకం, ఎన్‌టీఆర్‌ జలసిరి, సాగునీటి సదుపాయాల కల్పన, భూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. గ్రామాల్లో కూలీలకు మరింత చేయూతనందించి ఆర్థిక ఆసరా కల్పించేందుకు ఉపాధి హామీ పథకంలో పంట కుంటల తవ్వకం, చెరువుల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టనున్నారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువతకు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ నైపుణ్య, కార్పొరేట్‌ సంస్థలు, విశ్వవిద్యాలయాల సహకారంతో స్వయం ఉపాధి పొందేలా చేస్తారు.

మరికొన్ని అభివృద్ధికి బాటలు :  గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తారు. అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం చేపడతారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, ఇంకుడుకుంతల తవ్వకం, సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసి  పంచాయతీల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. అంతే కాకుండా పాఠశాల్లో వందశాతం విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, క్రీడా మైదానాల అభివృద్ధి చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement