స్పెల్లింగ్‌లలో దిట్ట మనోడే!
అమెరికా స్పెల్లింగ్ బీ పోటీలో గెలిచిన భారత సంతతి బాలుడు
న్యూయార్క్: అమెరికాలో నిర్వహించిన మిస్సోరి కౌంటీ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయ సంతతికి చెందిన 13 ఏళ్ల కుష్శర్మ విజేతగా నిలిచాడు. మొత్తం 95 రౌండ్లుగా సుదీర్ఘంగా సాగిన ఈ పోటీలో భాగంగా శనివారం జరిగిన తుది దశలోనూ ప్రతిభ చూపించాడు. తద్వారా ‘జాక్సన్ కౌంటీ స్పెల్లింగ్ బీ’ టైటిల్ దక్కించుకున్నకుష్ స్థానిక ఫ్రాంటియర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు.
అలాగే వచ్చే మే నెలలో వాషింగ్టన్లో జరగనున్న స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలకూ ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో గత ఏడాది భారతీయ సంతతి (హైదరాబాద్)కి చెందిన అరవింద్ మహంకాళి (13) విజయం సాధించాడు. ఇలా జాతీయ స్థాయి పోటీల్లో ప్రవాస భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు విజయం సాధించడం వరుసగా ఆరోసారి. కుష్ కూడా ఈ పోటీల్లో ప్రతిభ చూపిస్తే ఆ పరంపర కొనసాగించినట్లవుతుంది.