టాటా సన్స్‌పై మిస్త్రీ పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: టాటా సన్స్‌పై ఆ గ్రూప్ బహిస్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తోసిపుచ్చింది. మిస్త్రీని బోర్డ్ డైరెక్టర్ బాధ్య తల నుంచి తొలగించడానికి టాటా సన్స్ సోమవారం నిర్వహించతలపెట్టిన షేర్ హోల్డర్ల సమావేశాన్ని నిలుపుచేయాలని కోరుతూ మిస్త్రీ నేతృత్వంలోని రెండు కంపెనీలు తొలుత ముంబై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించాయి.
జనవరి 31న ఎన్సీఎల్టీ దీనిని తోసిపుచ్చడంతో అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను మిస్త్రీ ఆశ్రయించారు. తాజాగా ఇక్కడా ఆయనకు ప్రతికూల తీర్పు వెలువడింది. ‘‘మేము ఎలాంటి సానుకూల రూలింగ్‌నూ ఇవ్వడం లేదు. ఇందుకు సంబంధించి మూడు అప్పీళ్లనూ తిరస్కరిస్తున్నాం. తరువాత సవివరమైన ఉత్త్తర్వులను వెలువరిస్తాం’’ అని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
గౌరవనీయ పరిష్కారం...
మిస్త్రీ కంపెనీల పిటిషన్‌ను తిరస్కరించిన అప్పిలేట్ ట్రిబ్యునల్, కేసు పరిష్కారం విషయంలో కీలక సూచనలూ చేసింది. ‘‘ఈ కేసులో పార్టీలు గౌరనీయమైన ఒక పరిష్కారానికి రావాలి. అలాకాని పక్షంలో ఇరువైపుల ప్రతిష్ట దెబ్బతింటుంది. వాణిజ్య ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుంది. అలాగే ఉద్యోగుల నైతికతా దెబ్బతింటుంది.’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.