గుక్కెడు నీటితో గంపెడు రోగాలు
- నిరుపయోగంగా ఫీల్డ్ టెస్టింగ్ నీటి పరీక్షల కిట్లు
- శ్యాంపిల్స్ తీసుకోవడంలో ల్యాబ్‌ల నిర్లక్ష్యం
- కలుషిత నీటితోనే కాలం వెల్లదీస్తున్న అధికారులు
అనంతపురం సిటీ : గుక్కెడు నీరుతాగితే గంపెడు రోగాలు వెంటాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగింది. ఆ నీరు కూడా లభించని పల్లెల్లో కుంటలు, వంకలు, వ్యవసాయ బోరుబావుల ద్వారా లభించే నీటితోనే ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. ఆ నీరు ఏమాత్రం సురక్షితమో తేల్చి చెప్పేవారు లేకపోవడంతో పల్లెవాసులు అనారోగ్యాలతో పడకేస్తున్నారు.
కాళ్లు చచ్చుబడి కొందరు, పళ్లు పాచిపట్టి మరికొందరు, టైఫాయిడ్‌తో ఇంకొందరు ఆస్పత్రుల పంచన చేరుతున్నారు. వేసవి ఆరంభం నుంచి టైఫాయిడ్, కీళ్లనొప్పులు, కామెర్లు తదితర జబ్బుల బారిన పడి అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కలుషిత నీరు తాగి ఎంతమంది రోగాల బారిన పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు. అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం, రామగిరి, కనగానపల్లి తదితర ప్రాంతాల్లో ఈ తరహా జబ్బుల బారిన పడుతున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విషయమై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కూడా నిర్ధారణకు వచ్చారు.
పథకాలున్నా ఫలితం శూన్యం
జిల్లాలో 56 రక్షిత మంచినీటి పథకాలున్నా సమృద్ధిగా తాగునీరు లేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న నీరు కలుషితంగా ఉందని, వ్యవసాయ బోరు బావుల నుంచి తీసుకొస్తున్న నీటిలోనూ ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నీరు ఏమాత్రం తాగడానికి యోగ్యమైనదో కనీస పరీక్షలు కూడా చేయకుండా సరఫరా చేస్తుండటం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీల్లోని కార్యదర్శులు, అంగన్వాడీలు, సోషల్ వర్కర్లకు నీటి పరీక్షలు ఎలా చేయాలో గత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.
కలుషిత నీటి ద్వారా వచ్చే పలురకాల జబ్బులను ఆదిలోనే గుర్తించి నియంత్రించేందుకు అది దోహదపడింది. గ్రామాల్లో నీటి పరీక్షలు నిర్వహించి స్థానికంగా లభించే నీటి ద్వారా ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందో, లేదో నిగ్గు తేల్చేవారు. 2013, 2014లో జిల్లాలోని 1,003 గ్రామ పంచాయతీలకూ ఫీల్డ్ టెస్టింగ్ టూల్ కిట్ అందజేశారు. క్రమేణా పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు ఆ కిట్లను వాడటం మానేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి ప్రభుత్వం మండలానికి ఒక కిట్ మాత్రమే ఇచ్చింది. దీంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు ఆ కిట్‌ను తెచ్చుకుని నీటి పరీక్షలు నిర్వహించేందుకు శ్రద్ధ చూపడం లేదు.
శాంపిల్స్ తీయడం లేదు
గ్రామాల్లో ఎక్కువగా తాగునీటిని వినియోగించే బోర్లు, చెరువులను గుర్తించి తాగునీటి శాంపిల్స్‌ను జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది. ఆ నీరు కలుషితమైనట్లు తేలితే తక్షణం ఆ నీటిని ఎవరూ తాగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లోరైడ్ శాతం అ«ధికంగా ఉంటే ప్రజలు రోగాల బారిన పడకుండా తగు సూచనలు చేయాలి. అయితే గ్రామాల్లోనే పరీక్షలు చేయకపోవడంతో శాంపిల్స్ ఇచ్చే నాథులే లేకుండాపోయారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు అతి తక్కువ దూరంలో లభించే నీటిని సరఫరా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఎవరైనా నీరు సరిగా లేదని ప్రశ్నిస్తే తమ జేబులోంచి డబ్బులు ఖర్చు చేసి తోలుతున్నామని, ఆరు నెల్లకో, ఏడాదికో గానీ బిల్లులు రావడం లేదని ట్యాంకర్లవాళ్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరపాలక సంస్థలు, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.