రోమ్నీయా? గిలియానీనా?
విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్): కేబినెట్ పదవుల్లో అత్యంత కీలకమైనది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో? అగ్రరాజ్యంతో తమ సంబంధాలు ఎలా కొనసాగుతాయోనని చాలాదేశాలు ఆందోళన చెందాయి. చివరికి ట్రంప్ అధ్యక్షుడయ్యారు. అమెరికా మిత్ర దేశాలతో మునుపటిలా సంబంధాలు నెరపడటం, దేశ ప్రయోజనాలను కాపాడటం, ప్రపంచవ్యాప్తంగా అమెరికా వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూడటం, వివిధ దేశాలతో బంధాలను బలోపేతం చేయడం కొత్త సెక్రటరీ ఆఫ్ స్టేట్ ముందుండే సవాళ్లు. తన విమర్శకుడైన మిట్ రోమ్నీని విదేశాంగ మంత్రికి ట్రంప్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్వయంగా రోమ్నీ పేరు పరిశీలనలో ఉందని చెప్పారు. 2012లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అథ్యక్ష పదవికి పోటీపడి బరాక్ ఒబామా చేతిలో ఓడిపోయిన మిట్ రోమ్నీ... అధ్యక్ష లక్షణాలేవీ ట్రంప్‌కు లేవని బహిరంగంగానే విమర్శించారు. ఈనెల 19న రోమ్నీ- ట్రంప్‌తో భేటీ అయ్యారు. మొదట్లో నిక్కీ హేలీ పేరు కూడా ఈ పదవికి వినిపించినా బుధవారం ఆమెను ఐరాసకు అమెరికా రాయబారిగా నియమించారు. మిగిలిన వాళ్లలో ఐరాసకు అమెరికా రాయబారిగా గతంలో పనిచేసిన జాన్ బోల్టన్, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ బాబ్ కార్కర్, మాజీ న్యూయార్క్ మేయర్ రుడాల్ఫ్ గిలియానీ తదితరులు ఉన్నారు. వీరిలో గిలియానీకి అవకాశాలు మెండుగా ఉన్నాయని ట్రంప్ ప్రచార బృందసభ్యులు చెబుతున్నారు.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్