సినిమా ప్రభావంతో యువత పెడదారి...
కవి మిట్టపల్లి సురేందర్
భీమారం : జనం కోసమే తాను పాటలు రాస్తున్నానని కవి మిట్టపల్లి సురేందర్ అన్నారు. భీమారంలోని ఎన్ఆర్ఐ కళాశాల నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సినిమాల వల్ల యువత పెడదారిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాలో వస్తున్న పాటలు కేవలం వ్యాపార దృక్పథానికి సంబంధించినవిగా పేర్కొన్నారు. దర్శకులు, నిర్మాతలు వ్యాపార ధోరణితోనే సినిమాలు తీస్తున్నారన్నారు. కష్టపడి పనిచేస్తేనే కళాకారుడికి గుర్తింపు వస్తుందన్నా రు. తెలంగాణ ప్రాం తంలో వేలాది మంది కళాకారులు ఉన్నారన్నారు. ఇక్కడి కళాకారులకు సరైన గుర్తింపు లేదన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడినప్పటికీ ఇక్కడ ఉన్న దర్శకు లు, నిర్మాతలు ఈ ప్రాంత కళాకారులతో సిని మాలు తీయడానికి శ్రద్ధ చూపడం లేదన్నారు.
తెలంగాణ వచ్చినప్పటికీ సినిమా రంగం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దర్శకులు, నిర్మాతలే శాసించే అవకాశం ఉందన్నారు. పూర్వ కాలపు సినిమా, ఇప్పటి సినిమాలకు చాలా వ్యత్యా సం ఉందన్నారు. అలనాటి సిని మాలను కుటుంబ సపరివారంగా చూసేవారని, పాట లు సైతం వినసొంపుగా ఉండేవని వివరించా రు. ప్రస్తుత సినిమాలు కుటుం బంతో చూసే పరిస్థితులు లేవన్నారు. ఇప్పటి సినిమాల్లో పాడుతున్న పాటల్లో కనీసం భాష కూడా సక్రమంగా లేదన్నారు. పాడుతున్న పాటకు సరైన అర్థం కూడా లేదని చెప్పారు.
ఇప్పటి వరకు సుమారు 400 పాటలు రాసినట్లు సురేందర్ చెప్పారు. ఇందులో 30 పాటలను పాడినట్లు తెలిపారు. ఇందులో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకూ తెలియదురా’ అనే పాట రాష్ర్ట వ్యాప్తంగా మంచిపేరు తీసుకోచ్చిందన్నారు. రాజన్న, నాన్ స్టాప్, ధైర్యం సినిమాలకు పాటలు రాసినట్లు చెప్పారు. తాను రాసిన పాటలు ఎక్కువగా తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమానికే సంబంధించినవిగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో తాను రాసిన పాటలు ముఖ్య భూమిక పోషించాయన్నారు.
తెలంగాణ రాష్ర్ట సమితిని ప్రజలు విశ్వసించారు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ధైర్యం చేసి తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇక్కడ ప్రజలు ఆ పార్టీని నమ్మకుండా టీఆర్ఎస్కు ఓటు వేశారని సురేందర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా వ్యవహరించని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు రాస్తానని పేర్కొన్నారు.