తూనికల్లో మోసం... కేసు నమోదు
మేడ్చల్(రంగారెడ్డి జిల్లా): ఓ మిక్సింగ్ కంపెనీకి సరఫరా చేసే సామాగ్రి బరువు ఎక్కువ చూపించి మోసం చేస్తున్న వారిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మునీరాబాద్‌లో నగరానికి చెందిన రాజశేఖర్ డాంబరు కాంక్రీట్ మిక్సింగ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీకి నగరానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి సూర్య ట్రాన్స్పోర్ట్ ద్వారా డాంబరును సరఫరా చేస్తున్నాడు. సోమవారం కంపెనీకి డాంబర్ లోడ్ వచ్చింది.
దీంతో పూడూర్‌లోని తుల్జా భవాని కాంటాలో తూకం వేయగా 24 టన్నుల 940 కిలోలు వచ్చింది. వే బిల్లును చూసిన రాజశేఖర్‌కు అనుమానం వచ్చి వేరే కాంటాలో తూకం వేయించగా అక్కడ 22 టన్నుల 420 కిలోల బరువు వచ్చింది. దీంతో ఆయన తనను మోసం చేస్తున్న సప్లయర్ రాజేష్‌తోపాటు ట్రాన్స్పోర్ట్ వారిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.