స్టాలిన్ తంత్రం
డీఎంకేలో అసంతృప్తికి చోటులేదని చాటడంతో పాటుగా ఎంతటి వారినైనా సరే తన వైపు తిప్పుకుని తీరుతానని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ మరో మారు రుజువు చేశారు. పార్టీ అనుబంధ విభాగాల జాబితాలో తన రాజకీయ తంత్రాన్ని ప్రయోగించి అసంతృప్తి వాదులకు పదవుల్ని కట్టబెట్టారు. ఇందులో తన అన్నయ్య, పార్టీ బహిష్కృత నేత ఎంకే అళగిరి మద్దతుదారులు ఎక్కువగా ఉండడం గమనార్హం.
సాక్షి, చెన్నై : డీఎంకే దక్షిణాది కింగ్ మేయర్ ఎంకే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తమ నేతను బహిష్కరించడంతో ఆయన మద్దతుదారులు అధిష్టానంపై గుర్రుగానే ఉన్నారు. మళ్లీ అళగిరిని పార్టీలోకి ఆహ్వానించాలని ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లోనూ అళగిరి మద్దతు నేతలకు చోటు దక్కలేదు. గతంలో జిల్లాల కార్యదర్శులుగా పనిచేసిన నాయకులు, తాజాగా ఆ పదువుల్ని సైతం కోల్పోయూరు. డీఎంకేలో స్టాలిన్ హవా సాగుతుం డడం, ఆయన మద్దతుదారులకే సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కుడాన్ని అళగిరి మద్దతుదారులు జీర్ణించుకోలేక పోయారు. అళగిరి పుట్టినరోజును పురస్కరించుకుని కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న యోచనలో పడ్డారు. దీన్ని పసిగట్టిన స్టాలిన్ తన రాజకీయ తంత్రాన్ని ప్రయోగించారు. ఆగమేఘాలపై పార్టీ అనుబంధ విభాగాల కార్యవర్గాల భర్తీ లక్ష్యంగా కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్లపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. పార్టీ అనుబంధ విభాగాల పదవులను అసంతృప్తి వాదులు, అళగిరి మద్దతుదారులకు కట్టబెట్టి తన వైపు వారిని తిప్పుకునే రీతిలో వ్యూహ రచన చేసి సఫలీకృతులయ్యారు.
అసంతృప్తి వాదులకు పదవి :
ఇన్నాళ్లు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చిన వారందరికి ఏక గ్రీవంగా పదవుల్ని కట్టబెట్టడంతో పాటుగా అళగిరి పుట్టినరోజుకు ఆ నాయకులను దూరం చేశారు. శుక్రవారం అళగిరి పుట్టినరోజు వేడుకను మదురైలో ఘనంగా నిర్వహించేందుకు ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేశారు. దీన్ని పసిగట్టిన స్టాలిన్ అదే రోజున కార్యవర్గాల చిట్టాను విడుదల చేయిం చారు. అళగిరికి దూరంగా ఆయన మద్దతునేతలను తీసుకొచ్చేశారు. ఉదయాన్నే అనుబంధ విభాగాలు, రాష్ట్ర పార్టీ నిర్వాహక కమిటీ, తీర్మానాల కమిటీ, తదితర కమిటీల్లో అళగిరి మద్ద తు దారులు, అసంతృప్తి నాయకుల పేర్లతో జాబితాలు వెలువడేలా చేశా రు. అసంతృప్తి ఉన్న నాయకులు తమ కు పదవులు దక్కడంతో ఏకంగా అళగిరి బర్త్‌డే వేడుకకు డుమ్మా కొట్టారు.
ఎవరైనా నా వెంటే :
పదవుల్ని దక్కించుకున్న వారిలో ప్రధానంగా దక్షిణ తమిళనాడులో కీలక నేతలుగా ఉన్న వాళ్లు, మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఉన్నారు. పొన్ ముత్తు రామలింగం, పళణి మాణికయ్యం, కరుప్ప స్వామి పాండియన్, కన్నప్పన్, అప్పావు, తిరుచ్చి సెల్వ రాజ్, కేఎస్ రాధాకృష్ణన్, రంగనాథన్ పొంగలూరు పళని స్వామి, వెల్లకొవిల్ స్వామి నాథన్, ఏజీ సంపత్, రఘుపతి, సెల్వేంద్రన్, సెల్వ గణపతి, సత్యమూర్తి, ముత్తయ్య, తంగవేలు, కేపీపీ స్వామి, ఆర్డి శేఖర్, అలగు తిరునావుక్కరసు, సెంగుట్టవన్, లారె న్స్, ఆస్టిన్, పూంగోదై, ఇందిరా కుమారి, కాశిముత్తు మాణిక్య, మైదీన్ ఖాన్, వంటి నేతల్ని సంతృప్తి పరిచే రీతిలో ఏదో ఒక పదవిని అప్పగించారు. అళగిరికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కేపీ రామలింగానికి మళ్లీ వ్యవసాయ శాఖ కార్యదర్శి పదవిని అప్పగించారు. ఈ విషయమై స్టాలిన్ మద్దతు నేత ఒకరు పేర్కొం టూ, డీఎంకేలో అసంతృప్తికి చోటు ఉండదని, అందరూ అధినేత కరుణానిధి మార్గంలో నడవాల్సిందేనని చాటే రీతిలో స్టాలిన్ తన తంత్రాన్ని ప్రయోగించారని చెప్పారు. అళగిరి బర్త్‌డేకు కేపీ రామలింగం మినహా, తక్కిన ఆయన మద్దతు నేతలెవ్వరూ వెళ్ల లేదని వివరించారు. ఆ బర్త్‌డే వేదికగా ఎలాంటి కొత్త ఎత్తులకు ఆస్కారం లేకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు గా పార్టీలో ఇక అసంతృప్తికి కాలం చెల్లిందని చాటే విధంగా తమ నేత వ్యవహరించారని పేర్కొన్నారు.