ఎమ్మెల్యే ఆదికి శృంగభంగం
సాక్షి ప్రతినిధి, కడప:
ఎమ్మెల్యే ఆదికి మరోమారు శృంగభంగం తప్పలేదు. ఏసీసీ యాజమాన్యానికి వత్తాసుగా నిలవడాన్ని ప్రజలు ప్రతిఘటించారు. నిర్వాసితులు పక్షం రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా యంత్రాంగం అర్థం చేసుకోని ఫలితం శుక్రవారం తేటతెల్లమైంది. ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓలను సమావేశంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వెరశి శుక్రవారం పర్యావరణశాఖ జరపతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు వాయిదా పడింది.
ప్రజాందోళనను అర్థం చేసుకొని పరిష్కారం మార్గం చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఏసీసీ యాజమాన్యం ఇరువై ఏళ్లుగా పరిశ్రమ నెలకొల్పలేదు. భూనిర్వాసితులం అన్యాయం అయ్యాం. ఉద్యోగాలు వస్తాయంటే భూములు ఇచ్చాం. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నా నష్టపరిహారం లేదు. ఇరువై ఏళ్లు కిందట నామమాత్రపు ధరలతో భూములు చేజేక్కించుకున్నారు. సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకి లేదు. నిర్వాసితుల పరిస్థితి ఏమిటో తేల్చండి. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, పరిహారం ఎంత అప్పగిస్తారు? ఇలాంటి ప్రశ్నలు పక్షం రోజులుగా ఏసీసీ భూనిర్వాసితులు నుంచి విన్పిస్తున్నాయి. నిర్వాసితుల పక్షాన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిలవాల్సి ఉండగా ఇంతకాలం ‘నిమ్మకు నీరెత్తినట్లుగా’ ఉండిపోయారు. పైగా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వ్యక్తి సైతం అప్పట్లో డబ్బులు తీసుకొనే కదా? భూములిచ్చిందని నిర్లక్ష్యపు సమాధానం వెల్లడించడం. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో అధికారం ఓవైపు, ప్రజాపక్షం మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ప్రాంగణంలో తిష్టవేశాయి. ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షానా నిలవాల్సిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైతం ఏసీసీ యాజమాన్యంకు వత్తాసుగా నిలిచారు. ఆమేరకే నిర్వాసితుల నుంచి ప్రతిఘటన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది.
ఎమ్మెల్యేను అడ్డుకున్న ప్రజానీకం....
మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లె, ఉప్పలపాడు, చిన్నవెంతుర్ల, బెస్తవేముల, జంగాలపల్లె గ్రామాలల్లో సుమారు 3వేల ఎకరాల భూములను ఏసీసీ యాజమాన్యం సిమెంటు పరిశ్రమ కోసం 1996లో సేకరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పరిశ్రమ నెలకొల్పలేదు. తాజాగా పర్యావరణశాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందుకు సమాయత్తమైంది. ఈనేపధ్యంలో నిర్వాసితులు తాము ఇంతకాలం నష్టపోయాం, ఇప్పుడు మాపరిస్థితి ఏమిటి? ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు? పరిహారం మాటేమిటీ? అంటూ చేతులు కలిపారు. వారి సందేహాలను ప్రజాప్రతినిధిగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఆదిపై కూడ ఉందని విశ్లేషకుల భావన. కాగా ప్రజాభిప్రాయసేకరణకు మద్దతుగా ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యానించడం, అధికారులను సదస్సు నిర్వహించాలని చెప్పడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సదస్సులోకి వెళ్లకుండా నిర్వాసితులు గేటువద్దే అడ్డుకున్నారు. మెయిన్‌గేటు వద్ద నిర్వాసితులు పెద్ద ఎత్తున బైటాయించి ఉండగా, వెనుకవైపు ఉన్న గేటు ద్వారా వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. అక్కడ నుంచి కూడా ఎమ్మెల్యే సదస్సులోపలికి వెళ్లకుండా మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీతో పాటు నిర్వాసితులు అడ్డుతగిలారు. ఒకదశలో ఎమ్మెల్యే, నిర్వాసితులు మధ్య సంయమనం కోల్పోయి తోపులాటకు ఆస్కారం ఏర్పడింది. ఈలోగా కలెక్టర్ కెవి సత్యనారాయణ మెయిన్‌గేటు వద్దకు చేరుకోవడంతో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ సమన్యయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, నిర్వాసితులు కలెక్టర్ గోబ్యాక్....ఆర్డీఓ డౌన్‌డౌన్... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీఓ నిర్లక్ష్యంపై నిర్వాసితులు మండిపడ్డారు. అరగంటకు పైగా వేచియున్న కలెక్టర్ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈనేపధ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం వాయిదా పడింది.
ఇక్కడికిక్కడే నిర్ణయం చెప్పలేమన్న ఏసీసీ ప్రతినిధులు....
భూనిర్వాసితులు డిమాండ్స్ విషయమై ఏసీసీ ప్రతినిధులు ఇక్కడికిక్కడే నిర్ణయం తీసుకోలేమని, బోర్డు మీటింగ్‌లో సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సిన అంశాన్ని తాము స్పష్టం చేయలేమని తేల్చి చెప్పారు. కలెక్టర్, ఆర్డీఓ వెనుతిరిగిన అనంతరం ఎట్టకేలకు ఎమ్మెల్యే ఆది ఏసీసీ ప్రతినిధులతో సమావేశమైయ్యారు. నిర్వాసితులకు మీరేమి చేయగలరో తెలియ చెప్పండని, కోరగా తాము ఏమి చెప్పలేమని బోర్డు నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పసాగారు. కాగా తాను హామీ ఇస్తున్నా...నిర్వాసితులకు పరిహారం ఇప్పించగలనని ఎమ్మెల్యే ఆది ప్రకటించడం విశేషం. కాగా నిర్వాసితులు కలిసికట్టుగా వ్యవహారాన్ని ఎదుర్కొవడం, వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు అండగా ఉండడంతో ఏసీసీ యాజమాన్యం, అధికార యంత్రాంగం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది.