బొక్కలిరిసి కుప్పపెడుత..!
మంత్రి ఈటల సమక్షంలో విపక్ష నేతలపై ఎమ్మెల్యే బొడిగె శోభ అనుచిత వ్యాఖ్యలు
చొప్పదండి : ‘బెదిరిస్తే పోయెటోళ్లం కాదు.. ప్లకార్డులు పట్టుకొని వస్తే.. మేం గంత సోయి లేనోళ్లం కాదు.. మేమెంత వర్కు జేత్తున్నమో గీ ప్రజలకు తెలువదా? ఇం కొక్కసారి మేం జేసే కార్యక్రమానికి వస్తే మంచిగుండదు.. మా పోలీసోల్లైతే ఏం సేత్తలేరు.. ఎందుకంటె ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్నం కాబట్టి మా సీఐగారు, మా డీఎస్పీగారు, మా ఎస్సైలు అంతా నిలబడి సూత్తాండ్రు. బొక్కలిరిసి కుప్ప పెడుత నేనే.. ఇగ ఊర్కునే సమస్యేలేదు.’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ విపక్షాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం మిషన్ కాకతీయ రెండోదశ కింద చొప్పదండిలోని కుడిచెరువు పునురద్ధరణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలోనే ఆమె ఇలా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
కుడి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయూలంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులతోపాటు చొప్పదండి గ్రామస్తులు ప్లకార్డులతో సభావేదిక వద్దకు వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందించి కుడిచెరువు పరిస్థితి వివరించేందు కు యత్నించారు. ఇంతలోనే ఎమ్మెల్యే శోభ జోక్యం చేసుకొని పిటిషన్ మాత్రమే ఇవ్వాలని, ఏమీ మాట్లాడవద్దని, వెంటనే వేదిక దిగాలని గద్దించారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి దిగారు.