వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి
ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి
వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం
ఆమనగల్లు: విజయవాడలో అర్థరాత్రి తొలగించిన దివంగత మహానేత, ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని అక్కడే పునప్రతిష్టించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో మహానేత వైఎస్ విగ్రహం తొలగింపునకు నిరసనగా ఆమనగల్లులో ఆదివారం వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. విజయవాడలో మహానేత వైఎస్ కాంస్య విగ్రహాన్ని అధికార బలంతో అర్ధరాత్రి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అన్ని అనుమతులతో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసినప్పటికి అకారణంగా తొలగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగించిన చోటే వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహ ఏర్పాటు కోసం జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు ఆనంద్‌నాయక్, బాలస్వామి, రహీం, కాంగ్రెస్ నాయకులు, ఖాదర్, ఖలీల్, కృష్ణానాయక్, ధనుంజయ, పులికంటి మైసయ్య, రామలింగం, కండె సాయి, అలీం, రాఘవేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.