ఓ ఎమ్మెల్యే.. అరడజను గూఢచారులు
అధికారపార్టీ నేత అవినీతికి పరాకాష్ట
వసూళ్ల కోసం ప్రత్యేక టీం
ఎవరెవరు ఎంత తింటున్నారో నిఘా పెట్టాలని ఆదేశం
నివేదిక ఆధారంగా అక్రమ వసూళ్లు
కాదూ కూడదంటే బదిలీ బెదిరింపులు
గగ్గోలు పెడుతున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆలీబాబా.. అరడజను దొంగలు. ఇదేమంత కొత్త విషయం కాకపోవచ్చు. ఓ ఎమ్మెల్యే.. అరడజను గూఢచారులు. ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారిన అంశం. కొత్త సినిమాను తలపిస్తున్న ఈ వ్యవహారం కాస్తా అందరి నోళ్లలో నానుతోంది. నియోజకవర్గంలో అవినీతి పరుల చిట్టా తయారు చేయడమే ఈ గూఢచారుల పని. ఉన్నోడిని కొట్టు.. లేనోడికి పంచిపెట్టు.. ఇదీ సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించే కథ. అలాగని.. ఈ ఎమ్మెల్యే కూడా అవినీతి అధికారుల చిట్టా సేకరించి, వారి నుంచి మామూళ్లు వసూలు చేసి పేదలకు పంచుతాడనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇక్కడంతా రివర్స్. జిల్లాలో కొత్త పుంతలు తొక్కుతున్న అధికార పార్టీ నేతల వసూళ్ల బాగోతానికి ఇది పరాకాష్టగా నిలుస్తోంది. ఏకంగా గూఢచారులను నియమించుకొని ఏయే అధికారి ఎంత తింటున్నారో లెక్కలు వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ లెక్కల ఆధారంగా తన వాటా ఇచ్చుకోవాలని ఆ ఎమ్మెల్యే హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బదిలీ పేరిట బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. కొద్దిమంది అధికారులు తాము ఆ స్థాయిలో అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. కచ్చితంగా తన వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండటం గమనార్హం. ఈ విధంగా సదరు ఎమ్మెల్యే ఏకంగా ఆరుగురు గూఢచారులను నియమించుకొని సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం.
పక్కాగా అవినీతి చిట్టా
తనకు నమ్మకస్తులుగా ఉన్న ఆరుగురు అనుచరులను ఈ గూఢచర్యం పనికి సదరు ఎమ్మెల్యే నియమించుకున్నట్టు తెలిసింది. వీరి రోజువారీ పనంతా ఎవరెవరు ఎంత తింటున్నారనే వివరాలను సేకరించడమే. ఈ వివరాలను ఎప్పటికప్పుడు సదరు ఎమ్మెల్యేకు చేరవేస్తే సరి. ఆ సమాచారం ఆధారంగా సదరు ఎమ్మెల్యే తన వాటాను నిర్ణయించి సంబంధిత అధికారికి కబురు పంపుతున్నారు. ఇక ఆ మేరకు ఇచ్చుకోవాల్సిందే. ఈ విధంగా నియోజకవర్గంలో ప్రధానంగా ఏయే పోస్టుల్లో ఉండే అధికారులకు నెలకు ఎంత ఆదాయం వస్తుందనే విషయం కాస్తా గూఢచారులు ఎమ్మెల్యే చెవిన వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏయే డీల్స్ నడుస్తున్నాయి? ఫలానా డీల్ నుంచి ఏ అధికారి ఎంత తీసుకున్నారనే విషయం కాస్తా ఎమ్మెల్యేకు పూసగుచ్చినట్లు వివరిస్తున్నట్లు సమాచారం.
ఆందోళనలో అధికారులు
ఈ నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులు కూడా జంకుతున్నారు. ఇలాంటి రహస్య గూఢచారులను తాము ఇంత వరకు ఎక్కడా చూడాలేదని అధికారులు వాపోతున్నారు. ఒకవేళ తాము అవినీతికి పాల్పడకపోయినప్పటికీ వీరిచ్చే నివేదిక ఆధారంగా తమ నుంచి అంత మొత్తం.. ఇంత మొత్తం కావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని కొద్దిమంది అధికారులు వాపోతున్నారు. ఒకవేళ అడిగిన మొత్తం ఇవ్వకపోతే ఇక్కడ పనిచేయలేరనే బెదిరింపులు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్నాయని సదరు అధికారులు వాపోతున్నారు. ఈ కోవలోనే తాజాగా రోడ్ల విస్తరణ పనుల్లో కొన్ని షాపుల నుంచి ఒక అధికారి రూ.10 లక్షలు వసూలు చేశారని నివేదిక ఆధారంగా సదరు ఎమ్మెల్యే రూ.4 లక్షలు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఆయన బారిన పడి అనేక మంది అధికారులు లబోదిబోమంటున్నారు.