అడిగేవారు లేరనుకున్నారా!
♦ వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంజీవరావు ఆకస్మిక తనిఖీ
♦ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం
♦ రోగులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని హెచ్చరిక
వికారాబాద్ రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నట్లు సంతకం చేసి ప్రైవేటులో సేవలు చేస్తారా.. అడిగేవారు లేరనుకుంటున్నారా అంటూ ఎమ్మెల్యే సంజీవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ’’ఇందులో శైలజ అనే నర్సు సంతకం ఉంది.. ఆమె స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది కదా.. ఇప్పుడే నేను అక్కడ చూశాను.. ఆమె సంతకం ఇక్కడ ఎలా పెట్టిందని అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్‌ను ప్రశ్నించారు. ఉదయం వచ్చి సంతకం చేసి పని ఉంది బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిందని సమాధానం రావడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేస్తూ నోటీసులు పంపించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అంతా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.. రోగులను పట్టించుకోవడం లేదని అన్నారు. సూపరింటెండెంట్ స్థానికంగా ఉండడని, ఫోన్ తీయడని, అతనికి భయం లేనప్పుడు మిగతా వారు అలాగే ప్రవర్తిస్తారని చురకలంటించారు. పనులు చేసేవారు ఉండండి లేదంటే ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్లండన్నారు. దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేవారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నో బాధలతో వచ్చే వారికి ఉపశమనం కలిగేలా చూడాలిగానీ కొత్త ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, నాయకులు భూమోళ్ల కృష్ణయ్య, చంద్రకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.