దుర్గమ్మకు పట్టుచీర సమర్పించిన ఎమ్మెల్యే జలీల్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను గురువారం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జలీల్‌ఖాన్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద జలీల్‌ఖాన్ విలేకరులతో మాట్లాడారు.
దుర్గగుడి తన నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సీఎంకు దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరామని, ఎట్టకేలకు ఈ ఏడాది నుంచి దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులతో సిబ్బంది గౌరవంగా మెలగాలని ఎమ్మెల్యే సూచించారు.