చైనా కంపెనీలతో ఒప్పందాలపై అనుమానాలు
వైఎస్సార్సీసీ జిల్లా అధ్యక్షుడు కాకాణి
నెల్లూరు(సెంట్రల్) : చైనా పర్యటన సందర్భంగా చంద్రబాబు పలు కంపెనీతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలపై ప్రజల్లో అనుమానాలున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు లోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కంపెనీల చరిత్ర, వాటి పనితీరును ప్రజలకు చంద్రబాబు వివరించాలన్నారు. కృష్ణపట్నం వద్ద ఎరువుల కర్మాగారానికి చంద్రబాబు ఒప్పందంలో ఏదో కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. కాకినాడ నుంచి చెన్నై వరకూ గ్యాస్ పైప్ లైన్ విషయం ఇంకా కొలిక్కి రాలేదని, మరి గ్యాస్ లేకుండానే గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఎలా వస్తుందని కాకాణి ప్రశ్నించారు.
కృష్ణపట్నం వద్ద ఖాళీగా ఉన్న రిలయన్స్ భూములను కాజేసే కుట్రలో భాగంగానే ఈ పరిశ్రమను తెరపైకి తెచ్చినట్లు అనుమానం కలుగుతోందన్నారు. గ్యాస్ ఇస్తే దేశీయ సంస్థలైన ఇఫ్కో, క్రిభ్ కోలే జిల్లాలో ఎరువుల కర్మాగారాలను మరింత చవకగా ఏర్పాటు చేస్తాయని, వాటికి 3100 ఎకరాలు ఇప్పటికే కేటాయించారని వివరించారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఏ పెద్ద పరిశ్రమ కూడా జిల్లాకు రాలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలుచ్చేవన్నారు.
రుణమాఫీ పేరుతో మోసం
రుణ మాఫీ పేరుతో సీఎం చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారని కాకాణి విమర్శించారు. రుణ ఉపశమన పత్రాలు, బాండ్లను బ్యాంకర్లు ఖాతరు చేయడం లేదన్నారు. రైతుకు ఒకే నగదును రెండు సార్లు అకౌంట్లలో వేసినట్లు చూపుతున్నారని ఆరోపించారు. కాగా, వరదల్లో నష్టపోయిన ఆక్వా రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. టీడీపీ కార్యకర్తల కోసం ఎఫ్డీఆర్ నిధులను విడుదల చేశారని వి మర్శిం చారు. సమావేశంలో జెడ్పీటీసీలు వెంకట శేషయ్య, శివ ప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, కోవూరు మార్కెట్ మాజీ చైర్మన్ నిరంజన్‌బాబురెడ్డి పాల్గొన్నారు.