సీటు కోసం హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో తెలుగుదేశం నాయకుల పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఉన్న నాయకులకు సీట్లు ఇవ్వడానికి అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. మార్కాపురం సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మళ్లీ సీటు కోసం చంద్రబాబు నాయుడు నివాసం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఆయనకు స్పష్టమైన హామీ లభించడం లేదు. చంద్రబాబు నాయుడు స్వంత పార్టీ నాయకులను పూర్తిగా నమ్మడం లేదని ఆపార్టీకి చెందిన నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసినా కందుల నారాయణరెడ్డి అభ్యర్థిత్వంపై చంద్రబాబు నాయుడు ఆసక్తి కనబరచడం లేదని తెలిసింది. కందులను వదించుకోవడానికి మార్కాపురం సీటును బీసీకి కేటాయిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న కందుల నారాయణ రెడ్డికి స్పష్టమైన హామీ లభించకపోయినా, త్వరలో తనకు సీటు కేటాయిస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఆ స్థానాన్ని బీసీ నాయకుడు యిమ్మడి కాశీనాథ్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం తెలుగుదేశంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాయకుడు కావడంతో, ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు కోటరీలోని ఒక వర్గం ఆశిస్తోంది.
దీంతో పాటు కాశీనాథ్ స్థానిక బీసీ సంఘాలకు నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు జిల్లా నేత కరణం బలరాం ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కందులకు నియోజకవర్గంలో మంచి పేరు లేదని కరణం బలరాం వర్గం భావిస్తోంది. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కందుల నియోజకవర్గానికి చేసింది శూన్యమని, పార్టీని కూడా బలోపేతం చేసుకోలేకపోయాడని దీంతో ప్రజల్లో ఆయనకు మంచి పేరు లేదని చంద్రబాబుకు నూరిపోసినట్లు సమాచారం.
పార్టీ కార్యకర్తలను కూడా దూరంగా పెడుతూ వచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే జిల్లాలో ఏకైక తెలుగుదేశం ఎమ్మెల్యేగా పార్టీ పరువు కాపాడిన నాయకుడు కందుల నారాయణరెడ్డి అని, ఆయనకు సీటు ఇవ్వకపోతే ప్రజల్లో పార్టీ పట్ల దురభిప్రాయం ఏర్పడుతుందని అంటున్నారు. మార్కాపురంలో ైవె ఎస్సార్ కాంగ్రెసు అభ్యర్థులను ఎదుర్కొనే నాయకుడి కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.