వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీలోకి ‘కిడారి’ చేరిక
మండల వైఎస్సార్ పీపీ నాయకుల ధ్వజం
పెదబయలు: ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరారని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సందడి కొండబాబు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్సింగి గంగాభవానీ, వైస్ ఎంపీపీ వంతాల శాంతి విమర్శించారు. పెదబయలులో బుధవారం ఏర్పాటుచేసిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో గిరిజనునలు ఓట్లు వేసి అధిక మెజార్టీతో కిడారిని, కొంతమంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను గెలిపిస్తే వారంతా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీలో చేరారని ఆరోపించారు. మన్యంలో బాక్సైట్ గునపం దింపాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో ప్యాకేజీలకు ఆశపడి వారంతా పార్టీ మారారని ఆరోపించారు. చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలు చేయమని చెప్పడం వల్లే టీడీపీలో చేరినట్టు కిడారి చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి రావెల బాక్సైట్‌కు అనుకూలంగా ప్రకటన చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గిరిజనులను మభ్యపెడుతున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజనులు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే వారికి వంచనకు గురిచేశారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని గ్రామాల్లో రాకుండా ప్రజలు నిలువరించాలని కోరారు. గిరిజన జాతిలో వారికే ద్రోహం చేయడానికి కూడా వెనుకాడడంలేదన్నారు. వీరి అడుగుజాడల్లో పెదబయలు ఎంపీపీ ఉమామహేశ్వరరావు ఉన్నారని, వీరికి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఇలాంటి వారు వెళ్లిపోయినా పార్టీకి నష్టం లేదని, పెదబయలు మండలంలో ఒక్క ఎంపీపీ మినహా ఎంపీటీసీ సభ్యులను ఎవరూ పార్టీ నుంచి విడదీయలేకపోయారని అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జర్సింగి బాలంనాయుడు, జర్సింగి సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పోయిభ కృష్ణారావు, కొరవంగి మాధవరావు, చింతా బోడిరాజు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ మండల నాయకులు వంతాల అప్పారావు, కూడ అనంతరావు, గంపరాయి వెంకయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.