ఎమ్మెల్యే ‘కిడ్నాప్’పై రభస
► రాజ్యసభ పలుసార్లు వాయిదా
► ఎన్నికల్లో గెలుపు కోసంతమ ఎమ్మెల్యేలను అపహరిస్తున్నారన్న విపక్షం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి గుజరాత్‌కు చెందిన తమ ఎమ్మెల్యేను ఆ రాష్ట్ర పోలీసులు కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ శుక్రవారం రాజ్యసభలో తీవ్ర నిరసన తెలిపింది. ఉదయం సమావేశం కాగానే విపక్ష నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ డిప్యూటీ నేత ఆనంద్ శర్మలు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘వ్యారా నియోజకవర్గ ఎమ్మెల్యే పునాభాయ్ గామిత్.. జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ భేటీకి హాజరైన తర్వాత టీ కోసం మరో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినప్పుడు జిల్లా ఎస్పీ ఆయనను కిడ్నాప్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయించిందని, మీరు పార్టీని వీడి బీజేపీలో చేరాలని ఎమ్మెల్యేతో చెప్పారు.
బీజేపీ చీఫ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేయించి, మీకు టికెట్ ఇప్పిస్తానన్నారు... తర్వాత తాను బట్టలు మార్చుకుని వస్తానంటూ ఎమ్మెల్యే పారిపోయారు’ అని ఆజాద్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) నిర్వహణలో ప్రభుత్వ పాత్ర తగ్గించి, వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఏ విపత్కర పరిస్థతినైనా ఎదుర్కోవడానికి మన సాయుధ బలగాలు సైనిక సామగ్రికి సంబంధించి పూర్తి సామర్థ్యంతో ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు.