MLA kp Vivekananda
-
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - కె.పి వివేకానంద్
-
ఎమ్మెల్యే ఇల్లు కూల్చేయాల్సిందే: హైకోర్టు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు చెందిన భవనాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. తగినంత సెట్బ్యాక్లతో జి+1 నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని.. 4 అంతస్తులు కట్టడంతో దాన్ని కూల్చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. భవనాల్లో ఉన్నవాళ్లు మూడు నెలల్లో ఖాళీ చేయాలని, 6 నెలల్లోగా కూల్చివేత ప్రక్రియ మొత్తం పూర్తికావాలని హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి ప్లాన్‌ను ఉల్లంఘిస్తూ భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు కె.ఎం.ప్రతాప్ గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆ భవనంలో ఉన్న నారాయణ కాలేజీ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. చివరకు ధర్మాసనం కూడా సింగిల్ జడ్జి తీర్పునే సమర్థిస్తూ.. భవనాలను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. -
ఎమ్మెల్యే వివేకానందకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అక్రమంగా నిర్మించిన భవన సముదాయాలను కూల్చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమంటూ తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్ఎంసీ అనుమతుల్లేకుండా భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు కె.ఎం.ప్రతాప్ హైకోర్టులో గతేడాది ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. భవన సముదాయంలోని కాలేజీని జూన్ 1కల్లా ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ వివేక్, ఆయన కుటుంబ సభ్యులతోపాటు నారాయణ కాలేజీ యాజ మాన్యం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని గురువారం విచారించింది. ఎమ్మెల్యే వివేక్ తరఫు న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి, నారాయణ కాలేజీ తరఫున బి.నళిన్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) కింద పిటిషనర్లు దరఖాస్తు చేసుకున్నారని...బీపీఎస్‌పై హైకోర్టులో విచారణ సాగుతోందన్నారు. పిటిషనర్లు భవన నిర్మాణాలు చేపట్టే నాటికి బీపీఎస్ పథకం అమల్లో లేదు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పథకంపై పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల్లో అక్రమ కట్టడాలను కూల్చొద్దని సంబంధిత ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు కదా అని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పు సమగ్రంగా ఉందని, దీని అమలును నిలి పేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. -
జీహెచ్ఎంసీ ఎన్నికలంటే సర్కారుకు భయం: టీడీపీ
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతోందని టీడీపీ విమర్శించింది. బల్దియా ఎన్నికలపై హైకోర్టు తీవ్రంగా స్పందించినా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని ఆపార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గురువారం టీడీఎల్పీ కార్యాలయంలో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ప్రశ్నించినప్పుడల్లా ఆరు నెలల గడువు కావాలని కోరడాన్ని బట్టి ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వారి పాలన వదిలేసి ఎన్నికల వాయిదాకు అవకాశాలు వెతుక్కుంటోందని ఆయన మండిపడ్డారు. గ్రేటర్‌తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, 10 మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని రాజీనామా ఆమోదింపజేసి సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.