హైకోర్టు ఏసీజేతో చర్చలు విఫలం
- 13న చలో హైకోర్టుకు తరలిరండి
- అదే రోజున భవిష్యత్ కార్యాచరణ
- న్యాయవాద సంఘాల పిలుపు
సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల కేటాయింపులకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను విరమించాలని కోరేందుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే చర్చలకు ఆహ్వానించారని, అయితే ఆ చర్చలు విఫలమయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు, సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి, న్యాయవాద జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిరావు, రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందంతో ఏసీజే చర్చించారని జితేందర్‌రెడ్డి తెలిపారు. న్యాయాధికారుల ప్రొవిజినల్ జాబితాను రీకాల్ చేయాలని, హైకోర్టు నిబంధనల మేరకు కొత్త జాబితాను రూపొందించాలని తాము కోరామన్నారు.
కనీసం తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరామని, అయితే వినతిపత్రాన్ని పరిశీలిస్తామని మాత్రమే ఏసీజే చెప్పడంతో తాము వచ్చేశామని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న చలో హైకోర్టు కార్యక్రమం చేపడతామని...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు భారీ సంఖ్యలో ఇందులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అదే రోజు న్యాయవాదులతో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన న్యాయాధికారుల కేటాయింపులను రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కొనసాగుతున్న విధుల బహిష్కరణ
న్యాయాధికారుల ప్రిలిమినరీ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఐదో రోజూ కొనసాగింది. న్యాయవాదులకు మద్దతుగా భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున న్యాయశాఖ ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టుల్లోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, న్యాయవాదులతో కలసి ఆందోళనల్లో పాల్గొనరాదని న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులను హైకోర్టు హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే కోర్టు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్నా హైకోర్టు తమను బెదిరించే ప్రయత్నం చేస్తోందని న్యాయశాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు వైఖరి ఇదే తరహాలో ఉంటే సమ్మెకు వెళ్లేందుకూ వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు.
ఆప్షన్లను అంగీకరించొద్దు: ఎమ్మెల్యే రవీంద్ర
ఆంధ్ర ప్రాంత న్యాయాధికారులు తెలంగాణలో పనిచేయడానికి ఇచ్చిన ఆప్షన్లను అంగీకరించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. అలాగే వారి కేటాయింపులతో కూడిన ప్రాథమిక జాబితాను వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఆప్షన్ల ద్వారా తెలంగాణలో పనిచేసే న్యాయాధికారుల వల్ల తెలంగాణ న్యాయాధికారుల పదోన్నతుల్లో అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై న్యాయవాదులు చేపడుతున్న నిరసనలకు సంఘీభావం తెలిపారు.