MLA sanjivaravu
-
గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం
అనంతగిరి: తమ ప్రభుత్వ పాలనలో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. రూ.90 లక్షలకు పైగా నిధులతో పలు పనులు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి దశల వారీగా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. బిల్లులు తప్పకుండా వస్తాయన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ్ భారత్ కోసం పాటుపడాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వబోతోందని, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తోందని అన్నారు. గిరిగేట్‌పల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు క ల్పించడానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మద్గుల్ చిట్టంపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిగా ఉన్న పాఠశాల నూతన భవన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఎక్కువ టీచర్లున్న పాఠ«శాలల నుంచి డిప్యూటేషన్ చేస్తామన్నారు. ఇందుకు త్వరలో ఎంఈఓలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనవసరంగా విమర్శించొద్దు: ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ మా సీఎం, మంత్రులను అనవసరంగా విమర్శించడం మానుకోవాలన్నారు. ఆయనది కర్నాటక ప్రాంతమని, తాండూర్‌లో వచ్చి స్థిరపడ్డారని అన్నారు. ఈ ప్రాంతప్రజలు మంచోళ్లు కనుక గెలిపించారన్నారు. ఇకముందు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మాజీమంత్రికి అభివృద్ధి కంటే ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. వికారాబాద్ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. తాను ఈ ప్రాంతంలో 30 ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు చేస్తున్నాన్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముత్తాహార్ షరీఫ్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, పీఆర్ డీఈ రాజమోహన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, డీటీ కృష్ణయ్య, ఏఓ ప్రసన్నలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సింలు, ప్రభావతిరెడ్డి, మాణెమ్మ, శమంతాపాండు, అరుణ, లక్ష్మయ్య, ఎంపీటీసీ సాయన్న, నాయకులు, నర్సింహరెడ్డి, గోపాల్, వేణుగోపాల్‌రెడ్డి, సురేష్, చందర్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, రాజమల్లయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బూర్గుపల్లిని బాగు చేస్తా...
సమస్యల పరిష్కారానికి పాటుపడతా గ్రామాన్ని ప్రగతిపథాన నడిపిస్తా ఎక్కువ నిధులు మంజూరయ్యేలా చూస్తా వికారాబాద్ మండలంలోని బూర్గుపల్లి ఓ కుగ్రామం.. జిల్లా కేంద్రంగా కలలుగంటున్న పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ఆశించినస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. బూర్గుపల్లి రహదారి మార్గ మధ్యలో అధ్వానంగా మారడంతో అదనంగా నాలుగు కిలోమీటర్లు తిరిగి వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామంలో అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు సక్రమంగా లేకపోవటం తదితర సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు. తాగునీటి పైపులైన్ లేక ఎస్సీ కాలనీవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు బూర్గుపల్లిలో పర్యటించారు. అమ్మా.. అక్కా.. చెల్ల్లీ.. తమ్ముడూ.. పెద్దయ్య అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి పాటుపడతానని.. గ్రామాభివృద్ధికి ఎక్కువ నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని, ప్రజలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే: ఏం పెద్దమ్మా .. బాగున్నవా? రాములమ్మ: ఏం బాగ సార్.. ఆర్నెల్ల నుంచి పింఛన్ ఇస్తలేరు. సార్లను అడిగితే సప్పుడు జేయకుండపోతున్నరు. మా ఊల్ల శానమందికి పింఛన్లు ఒస్తలేవు. ఎమ్మెల్యే: పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నవా.. ఎందుకు ఇస్తలేరు? రాములమ్మ: అభయహస్తం పింఛన్ ఇస్తమని సంఘాలల్ల పైసలు కట్టిపిచ్చుకున్నరు. కొన్ని దినాలు పింఛన్లు ఇచ్చిన్రు. ఓట్లప్పటి నుంచి ఇస్తలేరు. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి సమస్య తెలుసుకుంటా. గ్రామంలో డబ్బులు చెల్లించిన వారందరికీ అభయహస్తం పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏమ్మా.. అంత మంచిదేనా.. ఏమైనా సమస్యలున్నాయా? జహంగీర్‌బీ: సార్ .. అంత బాగానే ఉన్నంగాని రేషన్ కార్డు ఇస్తలేరు. బియ్యం ఇయ్య లేదు. ఎమ్మెల్యే: దరఖాస్తు చేసుకున్నవా.. ఇంతకు ముందు బియ్యం వస్తుండెనా? జహంగీర్‌బీ: ముందుగల్ల వస్తుండె సారూ.. మొన్ననే రాలేదు. దరఖాస్తు గూడ ఇచ్చిన. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడతా. మీకు తప్పకుండా రేషన్ బియ్యం వచ్చేలా చూస్తా. ఈశ్వరమ్మ: సార్.. మా కాలనీల రోడ్లు బాగలేవు. మురికి నీళ్లన్నీ రోడ్డులోంచి, ఇళ్ల మధ్య నుంచి పోతున్నయ్. మురుగు కాలువలు కూడా లేవు. ఎమ్మెల్యే: అమ్మా.. మీ సమస్య అర్థమయ్యింది. వెంటనే ఇంజినీర్లను పంపిస్తా. ప్రతిపాదనలు సిద్ధం చేయించి పంపమని ఆదేశిస్తా. నిధులు మంజూరు చేసి డ్రైనేజీ నిర్మాణం చేపట్టేలా చూస్తా. దండు యాదమ్మ: సార్.. మాకు ఇల్లు లేదు. మంజూరు చేయించుండ్రి. ఎమ్మెల్యే: అధికారులను పంపిస్తా. విచారణ జరిపి అర్హత ఉంటే ఖచ్చితంగా ఇల్లు మంజూరయ్యేలా చూస్తా. ఎమ్మెల్యే: ఏం బాబు ఎలా ఉన్నారు. మీ సమస్యలేమిటి? రమేష్: అంతబాగానే ఉన్నం సార్.. ఇళ్ల మధ్య పెంటకుప్పలతో ఇబ్బందిగా ఉంది. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. చాలాసార్లు పంచాయతీ వాళ్లకు చెప్పినం. ఎవరూ పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే: నేను పంచాయతీ కార్యదర్శితో మాట్లాడతా. ఇప్పుడే మీ సర్పంచ్‌కు కూడా చెబుతున్న. పెంటకుప్పలు తీసివేసేందుకు 15 రోజుల్లో చర్యలు తీసుకుంటా. కుర్వ సుధాకర్: సార్.. మా కాలనీలో రోడ్లు బాగలేవు. కొంచెం వాన పడినా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే: త్వరలో మీ గ్రామానికి పంచాయతీరాజ్ ఈఈని పంపిస్తా. ప్రతిపాదనలు సిద్ధం చేయించి రోడ్లు, డ్రైనేజీ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏం పెద్దాయనా.. ఎలా ఉన్నావ్, అంతా మంచిదేనా? కావలి రాంచంద్రయ్య: సార్ బాగున్నం. మాకో ఇల్లు ఉంది. ఇల్లు ఉందని గతంలో ఇల్లు ఇయ్యలేదు. ఉన్న ఇల్లు మొత్తం వానొస్తే కురుస్తది. ఎమ్మెల్యే: సరే పెద్దాయనా.. అధికారులు వచ్చి చూస్తారు. త్వరలో మూడున్నర లక్షలతో డబుల్ బెడ్రూంతో కూడిన ఇల్లు ప్రభుత్వమే కట్టించి ఇస్తది. ఫికర్ చేయకు. కె.పెంటయ్య: సార్.. ఇండ్ల నడుమ ఉన్న బాయితో బాగ ఇబ్బంది ఉంది. పిల్లలు, పశువులు అక్కడికి పోకుండా కావలిగాయాల్సి ఒస్తుంది. జర గా బాయిని కూడిపేసి పుణ్యం గట్టుకోండి. ఎమ్మెల్యే: మీ సమస్య అర్థమయ్యింది. అధికారులు వచ్చి ఆ బావిని చూస్తారు. నీళ్లుంటే బాగు చేయించి అందుబాటులోకి తెస్తాం. లేదంటే ఉపాధిహామీ అధికారులకు చెప్పి పూడ్చి వేయిస్తాం. మల్లేశం: సార్ .. మా ఊర్ల పంటలు మొత్తం పాడైపోయినయ్. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే: వెంటనే అధికారులతో వివరాలు సేకరించి నష్టపరిహారం వచ్చేలా చూస్తాం. పెంటయ్య: సార్.. గల్లీల్ల ఇండ్ల నడిమికెళ్లి మురికినీళ్లు పోతున్నయ్, మోరీలు లేవు. ఎమ్మెల్యే: మీ కాలనీలో మురుగు కాలువల నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరిస్తా. శ్రీనివాస్: సార్.. మాకు ఉండనీకె ఇల్లు లేదు. ఎలక్షన్ల కంటె ముందు ఇల్లు మంజూరైంది. సగం వరకు కట్టుకున్నం. అప్పుడే ఎలక్షన్లు వచ్చినయ్. ఆ కారణంతో ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదు. ఎమ్మెల్యే: ఇళ్ల విషయంలో విచారణ జరుగుతున్నందున బిల్లులు ఆపారు. హౌసింగ్ ఏఈతో మాట్లాడి నీ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తా. సుజాత: సారు.. నా కొడుకు పేరు పవన్. ఈనికి మాటలు రావు, మూగోడు. మైండు గూడ పనిచేయది. సదరం సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇస్తలేరు. ఎమ్మెల్యే: సరేనమ్మా.. మీకు కొత్తగా సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తా. అధికారులకు చెప్పి నీ కొడుకుకు పింఛన్ ఇప్పించే బాధ్యత నాది. ముఖ్తార్పాష: సార్.. కరెంటోళ్లు నానా ఇబ్బందులు పెడుతున్నరు. చేనికాడ కరెంటు కోసం డీడీ కట్టి ఐదేండ్లు అయ్యింది. ఇంకా కరెంటు ఇస్తలేరు. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి స్తంభాలు, వైరు ఇప్పించి కనెక్షన్ ఇచ్చేలా చూస్తా. ఎమ్మెల్యే: ఏం పెద్దమ్మా బాగున్నవా.. ఏం పనులు చేస్తున్నరు? కిష్టంపల్లి లక్ష్మి: సారు.. నా బాధ ఎవరి చెప్పుకోవాలె. ఆనకాలంల ఇల్లు కూలిపోయింది. అప్పటి నుంచి కూలిపోయిన ఇంట్లనే ఉంటున్న. ఎమ్మెల్యే: నీ సమస్య అర్థమయ్యింది. గ్రామస్తులంతా చెబుతున్నరు. సర్కారు కొత్త ఇళ్లు మంజూరు చేస్తుంది. అప్పటి వరకు ఆ కూలిపోయిన ఇంట్ల ఉండకు. ఎవరింట్లోనైనా ఉండు. మాణెమ్మ: సార్.. మాకు డ్వాక్ర బిల్డింగు లేదు. చెంట్ల కింద మీటింగులు పెట్టుకుంటున్నం. బిల్డింగు మంజూరు చేయిండ్రి. ఎమ్మెల్యే: తప్పకుండా.. నిధులు మంజూరు చేసి మీకు డ్వాక్రా బిల్డింగ్ కట్టిస్తం. రాజు: సార్.. మాకు కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయండి. ఎమ్మెల్యే: పంచాయతీ వారు స్థలం కేటాయిస్తే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా.