ఏడాదిలోపు హంద్రీనీవాకు కృష్ణా నీరు
♦ ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చారు
♦ శాసనసభలో తన ప్రశ్నకు సమాధానం వెల్లడి
♦ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
గాలివీడు : ఏడాదిలోపు హంద్రీ నీవా కాలువ పనులను పూర్తి చేసి, కృష్ణానది నీటిని పారిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు శాసనసభలో తనకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండల మైనార్టీ నాయకుడు ఎస్.ఖాదర్ మెయిద్దీన్(ఎస్కే) ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభ సమావేశాల్లో రాయచోటి డివిజన్లోని కరువు, తాగు,సాగునీటి సమస్యలపై మంత్రిని ప్రశ్నించినట్లు చెప్పారు.
హంద్రీ నీవా కాలువకున్న మడకశిర, పుంగనూరు బ్రాంచ్ కెనాల్స్ పనులను పూర్తి చేయుటకు చూపుతున్న శ్రద్ధను ప్రధాన కాలువ పై కూడా దృష్టిపెట్టి పనులను వేగవంతం చేయమని మంత్రిని డిమాండ్ చేశానన్నారు. హంద్రీ-నీవా కాలువ పనులకు 200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అలాగే.. వైఎస్ హయాంలో వెలిగల్లు ప్రాజెక్టుకు ఇచ్చిన లింక్ కెనాల్‌కు ఏడు కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు.
సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి:
కరువుతో అల్లాడుతున్న రాయచోటి డివిజన్ ప్రాంతానికి వెలిగల్లు, శ్రీనివాసపురం ప్రాజెక్టులే మంచి పరిష్కార మార్గాలని ఎమ్మెల్యే చెప్పారు. పై ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 85 శాతం నిధులను దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఇచ్చినట్లు గుర్తు చేశారు. మిగిలిన నిధులను మంజూరు చేయించి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్న వెలిగల్లు ప్రాజెక్టు పనులను పూర్తి చేయుటకు కృషి చేస్తున్నానని చెప్పారు.
సంవత్సరంలోగా కృష్ణా నది నీటిని వెలిగల్లు, శ్రీనివాసపురం ప్రాజెక్టులకు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాంట్రాక్టర్ అకాల మృతితో వెలిగల్లు- గాలివీడు నీటి పథకం పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. వెలిగల్లు ప్రాజెక్టులో తాత్కాలికంగా మోటార్లు ఏర్పాటు చేసి గాలివీడుకు నీళ్లు ఇచ్చే పనులు చేపిస్తామన్నారు.
వైఎస్సార్ ముందు చూపు వల్లే వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయి రాయచోటి, గాలివీడు పట్టణాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నామన్నారు. నెలాఖరు నాటికి గాలివీడు టౌన్‌కు నీళ్లు తెప్పిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో యంపీపీ బండి చిన్నరెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు మధుభూషణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మైనార్టీ నాయకులు బాబాఫకృద్ధీన్, ఎస్కె తదితరులు పాల్గొన్నారు.