MLA srikanthreddy
-
ఏ పని సక్రమంగా చేశావు బాబూ..!
సాక్షి, గాలివీడు: పద్నాలుగేళ్ల మీ పాలనలో ఏ పని సక్రమంగా చేశావని చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలం పరిధిలోని అరవీడు, గాలివీడు, గోరాన్‌చెరువు గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలన అంతా ప్రచార ఆర్భాటం తప్పా అభివృద్ధి శూన్యమన్నారు. ఆదివారం రాయచోటిలో సీఎం బహిరంగ సభకు కోట్లు ఖర్చు చేశారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాయచోటికి తాగునీరు, వెలిగల్లు, ఘరికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్లు నిర్మించడం, రింగ్‌రోడ్డు, విద్యాలయాలు తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కృష్జా జలాలను రాయచోటి ప్రాంతానికి రానివ్వకపోవడమే కాకుండా, ఆ జలాలను కుప్పంకు తరలించే కాంట్రాక్ట్ పనులు ఇక్కడి టీడీపీ నేతలకు కట్టబెట్టి రాయచోటి వాసుల గొంతు కోయలేదా అని ప్రశ్నించారు. 2016 కల్లా రాయచోటికి కృష్ణా జలాలను ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీని నేటికి నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. వాస్తవాలు మాట్లాడుతుంటే దురుసుగా ప్రవర్తిస్తావా..? చంద్రబాబు కన్నా సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు సుగవాసి పాలకొండ్రాయుడు వాస్తవాలను మాట్లాడుతుంటే కనీస గౌరవం లేకుండా మైక్ లాక్కొని దురుసుగా ప్రవర్తిస్తావా అని విమర్శించారు. ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చరిత్ర వైఎస్సార్‌దేనన్నారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. బీసీలు ఉన్నత పదవులుకు పనికిరారని, ఎస్సీల్లో ఎవరూ పుట్టాలనుకుంటారని చెప్పిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. తాము అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఎమ్మెల్సీ మైనార్టీలకు కేటాయిస్తామని తమ అధినేత జగన్ ఎప్పుడో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న మీకు పట్టణంలో ప్రభుత్వ కళాశాల స్థల విషయం గుర్తుకు రాలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయితే నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. రూ.20 కోట్లకు ప్రశ్నపత్రాలను అమ్ముకున్న వారిని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జల్లా సుదర్శన్‌రెడ్డి, నాయకులు యధుభూషణ్‌రెడ్డి, ç ఉమాపతిరెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్మోద్దీన్, బీసీ సెల్ అధ్యక్షుడు వల్లపునాగేష్, మహిళా మండల అధ్యక్షురాలు వెలిగింటి నాగేశ్వరమ్మ, ఎస్టీ సెల్ అధ్యక్షులు హనుమాన్‌నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజాసంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం రాయచోటి: ప్రజాసంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని గడికోట శివలలిత ఓటర్లను కోరింది. మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 10 వార్డుల్లో సోమవారం స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు సరైన గౌరవం లభించకపోగా డ్వాక్రా రుణాల మాఫీలో తీరని అన్యాయం జరిగిందని వివరించారు. జగనన్న అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాల మాఫీ కావడంతో పాటు వృద్ధులకు రూ.3 వేల పింఛన్ వస్తుందన్నారు. ప్రచారంలో పట్టణ మైనార్టీ మహిళ అధ్యక్షురాలు నాజీనీన్, ఉపాధ్యక్షురాలు జబీన్, కౌన్సిలర్లు ఫయాజుర్ æరెహమాన్, వెంకటరామిరెడ్డి, కొలిమి చాన్‌బాషా, సలీమ్, రెహమాన్, ఫయాజ్ అహమ్మద్, గంగిరెడ్డి, చెన్నూరు అన్వర్‌బాషా, నిస్సార్‌అహమ్మద్, విక్కీ, దేవేంద్ర, అమీర్ పాల్గొన్నారు. -
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు
రాయచోటి: రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. టీడీపీ చేపడుతున్న తప్పుడు ప్రచారాలపై ధ్వజ మెత్తారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు రాబట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంట కాగడంతో పాటు సమైక్యాంధ్రలోను, ఇప్పుడు 7 సార్లు పొత్తును కొనసాగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తోందంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాలను కొనసాగిస్తూనే లౌకిక వాద పార్టీగా కొనసాగుతోందన్నారు.7 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి లౌకిక పార్టీ అని చెప్పే దమ్ము ఉందా అని నిలదీశారు. కేంద్ర మంత్రి చెప్పాడనో, ఇంకెవ్వరో చెప్పారనో నిందను వైఎస్సార్సీపీ పైకి నెట్టడానికి తెలుగుదేశం కుట్రలు పన్నుతోందన్నారు.బీజేపీతో వ్యతిరేకంగా పోరాడతానని పదేపదే చెబుతున్న చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెయ్యి ఇవ్వడానికి ఎంత తాపత్రయపడ్డాడో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన పక్కనే కూర్చొని గుసగుసలాడిన విషయాలను ప్రజలు కళ్లారా చూశారన్నారు. ఇంకో వైపు తిరుపతి తిరుమల దేవస్థానంలో బీజేపీ నాయకులకు పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తన కేసులకోసం భయపడి రాజీపడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అవాకులు, చవాకులు పేలుతున్నారంటూ దుయ్యబట్టారు. మరోవైపు రామోజీరావు ద్వారా అమిత్‌షాతో రాజీ ప్రయత్నాలు చేస్తున్న సీఎం రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పిన విషయం ప్రజలు గుర్తించారన్నారు. -
‘ఓర్వలేక పోతున్న చంద్రబాబు’
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం చంద్రబాబు పాలనపై విసుగెత్తిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు గత నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా కడప జిల్లా, రాయచోటి నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. మహనేత వైఎస్సార్ మేనిఫెస్టోలో వున్నవి, లేనివి అమలు చేసి పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రైతులకు పండించిన పంటలకు ధరను ముందుగానే నిర్ణయించి ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జగన్ హామీయిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 45 సంవత్సరాల కలిగిన వారికి రెండు వేల పెన్షన్, వ్యవసాయ యంత్రాలకు పన్నులు తొలగింపు, ఖరీఫ్ పంటలో రూ.12500 వేలు ఇస్తామని వాగ్దానం చేసినట్టు చెప్పారు. వైఎస్ జగన్ ప్రకటించిన ప్రతి సెలూన్ షాపుకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్, మైనారిటీ వివాహాలకు ఒక లక్ష, ఆటో కార్మికులు రూ.10 వేలు వంటి మంచి పథకాలను ప్రజలకు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూసి జననేత హామీలు ఇస్తున్నారని వాటిని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తారని చెప్పారు. -
మాపై నీచ ప్రచారం
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి, తాను, ఇతర పార్టీలకు చెందిన మరికొందరు నేతలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమై ప్రాంతీయ ఉద్యమాన్ని లేవదీయబోతున్నామంటూ ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి చానెల్ నీచమైన ప్రచారానికి తెర లేపిందని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో చానెల్ యజమాని రాధాకృష్ణ వైఖరిని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ‘వాస్తవానికి నేను హైదరాబాద్‌లోనే లేను. నా నియోజకవర్గంలో ఉన్నా. చంద్రబాబు హయాంలో మొత్తంగా 13 జిల్లాలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని, ప్రత్యేకించి వెనుకబడిన జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదాన్ని ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేము బహిరంగంగా ప్రజల దృష్టికి తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మైసూరారెడ్డిని, నన్నూ ప్రస్తావిస్తూ ఈ రోజు ఇచ్చిన కథనం పూర్తిగా ఆ చానెల్ దిగజారుడు జర్నలిజానికి, చెంచాగిరీకి, కుట్ర పూరిత వ్యవహారానికి అద్దం పడుతోంది. తిరుపతిలో ఎకరం భూమి రూ.5 కోట్లు పలుకుతోంటే.. ఎక రా కేవలం రూ.80 లక్షల చొప్పున 1.5 ఎకరాల భూమిని చంద్రబాబు పభుత్వం ఈ చానెల్ యాజమాన్యానికి కట్టబెడుతూ మంత్రివర్గం చేత ఒక తీర్మానం ఆమోదింప జేసుకుంది. ఇది జరిగిన మరునాడే చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు ఇంతగా దిగజారి పోయి ఆ చానెల్ ఈ కథనాన్ని అల్లింది. రాష్ట్రంలో ఒకపక్క కరువు నెలకొంది. అప్పుల తో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. పట్టిసీమ నుంచి రాజధాని వరకు, ఇసుక నుంచి మైనింగ్ వరకు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, రాక్షస చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. అన్నింటికీ మించి వంగవీటి మోహనరంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న అంశంపై రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం అంతా అట్టుడుకుతోంది. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అప్పనంగా రూ.కోట్ల ఆస్తిని కట్టబె ట్టిన చంద్రబాబు రుణం తీర్చుకోవడానికే ఈ చానెల్ ఇంతగా దిగజారిపోయి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మీద, మైసూరారెడ్డిపైనా, చివరకు నామీద కూడా పాతాళపు స్థాయి నీచ రాజకీయానికి దిగింది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు మా పార్టీ వ్యతిరేకం. హైదరాబాద్ అనుభవాల నేపథ్యంలో అటువంటి పని చేయరాదన్నది మా విధానం. ఈ విషయంలో దాపరికం కానీ రాజీ గానీ ఉండబోదు..’ అని గడికోట తన ప్రకటనలో స్పష్టం చేశారు. -
'పుష్కరాల పేరిట 30 మందిని బలిచేశారు'
కడప : గోదావరి పుష్కరాల నిర్వహణ పేరిట 30 మంది అమాయక ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలి తీసుకుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేస్తుందని, కేవలం ఆర్భాటాలకే పెద్దపెట వేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులు సమస్యలతో అల్లాడుతుంటే వేల కోట్ల రూపాయలు వెచ్చించి పుష్కరాల సినిమా తీస్తారా అని ఈ సందర్భంగా రాయచోటి ఎమ్మెల్యే ప్రశ్నించారు. రైతాంగం నిర్వీర్వం కాకముందే వారిని ఆదుకోవాలని, ఎకరాకు రూ. 20 వేలు తక్కువ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఏపీ మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.