సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం చంద్రబాబు పాలనపై విసుగెత్తిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు గత నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా కడప జిల్లా, రాయచోటి నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. మహనేత వైఎస్సార్ మేనిఫెస్టోలో వున్నవి, లేనివి అమలు చేసి పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రైతులకు పండించిన పంటలకు ధరను ముందుగానే నిర్ణయించి ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జగన్ హామీయిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 45 సంవత్సరాల కలిగిన వారికి రెండు వేల పెన్షన్, వ్యవసాయ యంత్రాలకు పన్నులు తొలగింపు, ఖరీఫ్ పంటలో రూ.12500 వేలు ఇస్తామని వాగ్దానం చేసినట్టు చెప్పారు.
వైఎస్ జగన్ ప్రకటించిన ప్రతి సెలూన్ షాపుకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్, మైనారిటీ వివాహాలకు ఒక లక్ష, ఆటో కార్మికులు రూ.10 వేలు వంటి మంచి పథకాలను ప్రజలకు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూసి జననేత హామీలు ఇస్తున్నారని వాటిని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment