మిషన్‌పై ఫైర్
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. మిషన్ కాకతీయపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం జడ్పీ సీఈవో మారుపాక నాగేష్ సమావేశాన్ని ప్రారంభించారు. అందరూ సహాయ సహకారాలతో పనిచేయూలని సీఈవోతోపాటు జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత ఆకాంక్షించారు. వచ్చేనెలలో జిల్లాలో రెండు ముఖ్యకార్యక్రమాలు హరితహారం, గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. హరితహారంలో మూడులక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్‌పై ఏకగ్రీవ తీర్మానం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రతిపాదించారు. ఈ మేరకు సభ ఏకగ్రీవం తీర్మానం చేయాలని సూచించారు. సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో చైర్పర్సన్ ఆమోదం తెలిపారు. రిజర్వేషన్ల నిర్ణయం కేంద్రం పరిధిలో ఉంటుందని, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మలకు వివరించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
కాకతీయ మిషన్ ద్వారా చేపడుతున్న చెరువుల అభివృద్ధి నివేదికను ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్ వివరించారు. పినపాక నియోజకవర్గంలో రాయన్నకుంట చెరువు పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై అర్హత గల రైతులకు మట్టి తోలకుండా అర్ధరాత్రి దొంగల్లా మట్టిని రూ.300కు విక్రరుుంచారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సభ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ నిర్ణయం మంచిదైనప్పటికీ అధికారులు, అధికారపార్టీ నేతల నిర్వాకంతో లక్ష్యం దెబ్బతింటోందని పాయం వాపోయూరు.
ఏజెన్సీలో చెరువు పనులకు అటవీ అధికారుల నుంచి అనుమతి ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ మిషన్ పనులు కొనసాగుతున్న చెరువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు రికార్డు చేయూలని, ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే రెండుమూడురోజుల్లో రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. శాసనసభ్యుల ప్రతిపాదనలను సైతం పక్కనబెట్టారని వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా చెరువు పనులు సాగటం లేదని ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ సభ దృష్టికి తెచ్చారు. క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ కమిటీలు ఎన్ని చెరువులపై విచారణ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చిమ్మపూడిలో కట్టమీద ఉన్న చెట్లను తొలగించకుండానే మట్టితో పూడ్చి వేస్తుంటే రైతులు అడ్డుకున్నారన్నారు. దీనిపై ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ నాయకులు బెదిరించారని అన్నారు. దీనిపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆక్షేపణ తెలిపారు.
అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి వెళ్లిపోవాలని అటవీ అధికారులు పోడుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రస్తావించారు. ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు..జడ్పీటీసీలకు అవకాశం ఇవ్వరా? అని రఘునాథపాలెం జడ్పీటీసీ వీరూనాయక్ అనడంతో ‘అరుుతే మేము అవసరం లేదా?’ అంటూ ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ బయటకు వె ళ్లబోయూరు. చైర్పర్సన్ జోక్యం చేసుకొని ఆయనకు నచ్చజెప్పారు.
ఐటీడీఏ గవర్నింగ్ బాడీకి తీర్మానం..
ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించాలని సభ తీర్మానించింది. మైదాన ప్రాంతలో ఐటీడీఏ ద్వారా ఎక్కడ ఏయే పనులు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉందని ఎమ్మల్యేలు మదన్‌లాల్ ,అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో రుణాలకు బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వడం లేదని జడ్పీటీసీ ఉన్నం వీరేంధర్ తెలిపారు. స్థానిక సంస్థల 29 అధికారాల్లో ప్రతి అంశం జడ్పీ కిందకు వస్తుందని, వ్యవసాయశాఖ లావాదేవీలన్నీ ఆమోదం తీసుకుంటున్నారా అని జేడీఏని మదన్‌లాల్ ప్రశ్నించారు. ఇక నుంచి అన్ని అంశాలను జడ్పీలో చర్చించి, ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలని చైర్పర్సన్ సూచించారు.
బోనకల్ మండలంలో మూడుగ్రామాలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ వచ్చిందని, దానిలో 600 ఎకరాలు బోగస్ అని తేలిందని, అర్హులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎరువులు ఇవ్వకుండా ఖమ్మంకు తరలించారని జెడ్పీటీసీ, ఎంపీటీలు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కవిత, జేడీఏ, ఆత్మ పీడీలను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.