బెదిరింపులతో చితికిపోతున్నాం..!
ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన నగరపాలక సంస్థ ఉద్యోగులు
దాడులను ఎదుర్కొనేందుకు నూతనంగా కమిటీ ఏర్పాటు
అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థలో అధ్వానమైన పరిస్థితి నెలకొందని, నిత్యం బెదిరింపులతో చితికి పోవాల్సి వస్తోందని అధికారులు, ఉద్యోగులు ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను కలిసిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. ఏఈ సుభాష్ రాజీనామా చేసే స్థాయికి వచ్చాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల చేయమని వేధించడమేమిటన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామన్నారు. ఒకరికి పని చేస్తే మరో వర్గం లక్ష్యంగా చేసుకుని దురుసుగా ప్రవర్తిస్తోందన్నారు. ఈఈ, డీఈ, ఏఈ అధికారులన్న ఆలోచన లేకుండా దుర్భాషలాడడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తమ పట్ల ఇంత వివక్ష చూపించడం సరికాదన్నారు.
కార్పొరేటర్లు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పాలకవర్గంలోని నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కింది స్థాయి ఉద్యోగి నుంచి అధికారుల వర కు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాగైతే ఏవిధంగా పనిచేయాలని ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను తాము కాపాడుకునేందుకు ఓ కమిటీను వేసుకుంటామని తెలిపారు.
ఎవరినీ ఉపేక్షించ వద్దు: ఎమ్మెల్యే
విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధికారులకు భరోసా ఇచ్చారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు, ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. ధైర్యంగా, స్వేచ్ఛగా పని చేయాలన్నారు. నగరాభివృద్ధికి అందరూ ముందుకు రావాలన్నారు. ఎవరైనా సరే అధికారులు, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులతో సమన్వయంతో పని చేయించుకోవాలన్నారు. ఎమ్మెల్యేను కలసిన వారిలో అడిషినల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, డిప్యూటీ కమిషనర్ అజయ్ కిషోర్ తదితరులున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసుకున్న నగరపాలక సంస్థ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఇదేగౌరవాధ్యక్షులుగా చల్లా ఓబులేసు(కమిషనర్), అధ్యక్షుడుగా నరసింహులు, కార్యదర్శిగా బీఎస్ కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శిగా మురళీ, కోశాధికారిగా రమణ, ఉపాధ్యక్షులుగా నవనీతకృష్ణ, సతీష్, సురేంద్ర, బాషా ఉన్నారు.
దళిత ఉద్యోగులను వేధిస్తే సహించం
= ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం హెచ్చరిక
అనంతపురం న్యూటౌన్ : అధికార పార్టీ నాయకుల అరాచకాలు క్రమంగా పెరిగిపోతున్నాయని, దళిత ఉద్యోగులపై ప్రతాపం చూపిస్తుండడం దారుణమని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ రామప్రసాద్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దళిత ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అనేక అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సుభాష్చంద్రబోస్కు సమయానికి మించి పని భారం పెట్టడం వల్ల కుటుంబానికి చెప్పుకోలేక, ఇటు అధికారులకు చెప్పలేక మనోవేదనకు గురై ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.