MLA varupula Subba Rao
-
ఎన్ని కుట్రలు చేసినా టిక్కెట్ నాదే
తూర్పుగోదావరి, ఏలేశ్వరం, (ప్రత్తిపాడు): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ తనదేనని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని లింగంపర్తి గ్రామంలో తన ఇంటివద్ద మంగళవారం నియోజకవర్గ టీడీపీ, తనవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ డీసీసీబీ చైర్మన్, తన మనువడు వరుపుల రాజాకు ఇచ్చినట్టుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో రావడంతో ఎమ్మెల్యే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవంతోపాటు 13 ఏళ్లుగా అనేక పదవులు చేసిన తనకు గానీ, గత 36 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్న పర్వత కుటుంబానికి గానీ అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందన్నారు. ఇద్దరిలో ఎవరికి ఇవ్వకపోయినా వేరే అభ్యర్థిని గెలిపించే ప్రశ్నేలేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వరుపుల రాజా తనను మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. టిక్కెట్ విషయంలో చంద్రబాబుపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, ఎంపీపీ అయిల సత్యవతి, గొంతిన సురేష్, రొంగల సూర్యారావు, వాసిరెడ్డి భాస్కరబాబు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వరుపుల కుమారుడిపై రేప్ కేసు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా.. కాకినాడ రూరల్: గిరిజన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన నేరంపై తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రెండో కుమారుడు వరుపుల రాజుబాబుపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, జిల్లాలోని వై.రామవరం మండలం దాలిపాడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కుటుంబం, ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని ఎమ్మెల్యే వరుపుల ఇంటి సమీపాన కొన్నేళ్లుగా నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆ గిరిజన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే కుమారుడు రాజుబాబు నమ్మించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్యా రెండ్రోజులుగా గొడవ జరుగుతోంది. చివరకు ఆమెను పెళ్లి చేసుకోనని రాజుబాబు తెగేసి చెప్పాడు. దీంతో ఆ యువతి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 376, 373 సెక్షన్లపై క్రైం నంబర్ 323/16 కింద ఎమ్మెల్యే కుమారుడు రాజుబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసులు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.