ఎమ్మెల్యే వరుపుల కుమారుడిపై రేప్ కేసు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా..
కాకినాడ రూరల్: గిరిజన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన నేరంపై తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రెండో కుమారుడు వరుపుల రాజుబాబుపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, జిల్లాలోని వై.రామవరం మండలం దాలిపాడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కుటుంబం, ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని ఎమ్మెల్యే వరుపుల ఇంటి సమీపాన కొన్నేళ్లుగా నివాసం ఉంటోంది.
ఈ నేపథ్యంలో ఆ గిరిజన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే కుమారుడు రాజుబాబు నమ్మించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్యా రెండ్రోజులుగా గొడవ జరుగుతోంది. చివరకు ఆమెను పెళ్లి చేసుకోనని రాజుబాబు తెగేసి చెప్పాడు. దీంతో ఆ యువతి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 376, 373 సెక్షన్లపై క్రైం నంబర్ 323/16 కింద ఎమ్మెల్యే కుమారుడు రాజుబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసులు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.