రంగా హత్యకేసులో నిందితుడు వెలగపూడి
టీడీపీది హత్యా రాజకీయాల చరిత్ర
వైఎస్సార్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ధ్వజం
విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దివంగత వంగవీటి రంగా హత్యకేసులో ప్రధాన సూత్రధారి.. నేటికీ ఆ కేసులో ఏ-5 నిందితునిగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువేన్నారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనను ఇంకా రాష్ర్ట ప్రజలు మర్చిపోలేదన్నారు. టీడీపీ హత్యా రాజకీయాల చరిత్రకు ఎమ్మెల్యే వెలగపూడి ప్రత్యక్ష నిదర్శనమని తీవ్రంగా దుయ్యబట్టారు. తీర్చలేని హామీలు వంద ప్రకటించిన చంద్రబాబు వాటిలో ఒక్కదాన్ని కూడా నూరు శాతం పూర్తిచేయలేదన్నారు.
ఏడాదిన్నర చంద్రబాబు పాలనపై ఒక్కసారి మీకు మీరే ఆలోచించించుకోండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏంచేసిందో అని ప్రజలకు సూచించారు. మహిళా సాధికారత అంటే మిహ ళా అధికారిని రోడ్డు మీదా ఈడ్చి కొట్టడమా! అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో పాలకపక్ష తీరును ఎండగట్టే మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాను సస్పెండ్ చేయడమా? ఆలోచించండి ఆయన కోరారు. తప్పుడు కేసులతో అప్పటి కేంద్రం ప్రభుత్వం, టీడీపీతో కుమ్మక్కై జైలుకు పంపినప్పటికీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెనకడుగు వేయలేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఆరున్నరేళ్లుగా ప్రభుత్వాలపై ఆయన యుద్ధం చేస్తున్నారని చెప్పారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా విశాఖ నగర, రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని విజయసాయిరెడ్డి ప్రజలను కోరారు.