లొంగిపోయిన మహిళా ఎమ్మెల్సీ.. 14 రోజుల కస్టడీ
విదేశీ మద్యం అక్రమ నిల్వ కేసులో సస్పెండైన జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి మంగళవారం తెల్లవారుజామున గయ కోర్టులో లొంగిపోయారు. ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే.. అసలు తన ఇంట్లో విదేశీ మద్యం ఏమీ దొరకలేదని, తనను రాజకీయంగా ఇరికించాలనే ఇలా చేశారని మనోరమాదేవి అన్నారు. తాను నిరపరాధినని కోర్టు వద్ద మీడియాతో చెప్పారు. ఆమె కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గయ ప్రాంతంలో తన కారును ఓ యువకుడు ఓవర్టేక్ చేశాడన్న కోపంతో అతడిని కాల్చిచంపిన కేసులో నిందితుడు.
ఈ కేసులో మనోరమాదేవిని ప్రశ్నించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా అక్కడ భారీ మొత్తంలో విదేశీ మద్యం సీసాలు లభించాయి. దాంతోపాటు, ఓ బాలకార్మికుడిని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నట్లు కూడా ఆమెపై కేసు పెట్టారు. తన కొడుకు రాకీ యాదవ్‌ను పోలీసులకు దొరక్కుండా దాచిపెట్టినందుకు సైతం మరో కేసు నమోదైంది. దీంతో చాలా కాలంగా పరారీలో ఉన్న మనోరమాదేవి.. ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు.