హరికృష్ణ, ఎస్వీ దీక్ష భగ్నం
సాక్షి నెట్వర్క్: వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేత డాక్టర్ హరికృష్ణ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రారంభించిన ఆమరణ దీక్షను పోలీసులు శనివారం మధ్యాహ్నం భగ్నం చేశారు. ఆరురోజులుగా ఆమరణ దీక్ష చేయడం వల్ల హరికృష్ణ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి.. అంబులెన్సలో బలవంతంగా కొత్తచెరువు ఆస్పత్రికి తరలిం చారు. ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని ఆయన మొండికేయడంతో వైఎస్సార్ సీపీ నేతలు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు.
కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య శనివారం తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేశారు. ఎస్వీ దీక్ష శనివారంతో ఆరోరోజుకి చేరిన నేపథ్యం లో ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు సూచించడంతో ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు పెద్ద సంఖ్య లో శిబిరం వద్దకు చేరుకుని బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు చేయించుకునేందుకు ఎస్వీ మోహన్‌రెడ్డి నిరాకరిస్తూ దీక్షను కొనసాగించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి ఆసుపత్రికి చేరుకుని కొబ్బరి నీళ్లిచ్చి దీక్షను విరమింపజేశారు. శ్రీకాకుళంలో పద్మజ దీక్ష భగ్నం: శ్రీకాకుళంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ నాలుగురోజులుగా చేపట్టిన ఆమరణ దీక్షను శనివారం సాయంత్రం 6 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా పద్మజను అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.