సీబీఐతో విచారణ చేయించాల్సిందే!
పుట్టపర్తి టౌన్ : పేదల ఆస్తులను అన్యాక్రాంతం చేయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు సాగించిన విశాఖ భూకుంభకోణంపై వెంటనే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సిపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక సాయి ఆరామంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పేదలకు చెందిన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను తమ పార్టీ నాయకులకు దోచిపెట్టేందుకు విశాఖలో పక్కాగా ప్రభుత్వమే పథకం రచించినట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇందులో సీఎం తనయుడు లోకేష్,మంత్రి గంటా,ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిల హస్తం ఉందన్నారు. సీబీఐ ఎంక్వయిరీ వేస్తే నిజాలు బయటికి వస్తాయనే చంద్రబాబు తన అధీనంలో నడిచే అధికారులతో సిట్ ఎంక్వయిరీ వేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తుండటం అక్కడి పేదలను మోసం చేయడమేనన్నారు.
ప్రభుత్వం పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, 2018లోపు పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి క్యుములేటివ్ టైం డిపాజిట్ స్కీమును అమలు చేస్తే పెన్షన్లను ఎటువంటి డోకా లేకుండా ఇవ్వవచ్చన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను వర్తింపజేసి వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎండుతున్న ఉద్యాన పంటలకు రక్షకతడులు అందిస్తామని వ్యవసాయ మంత్రి చెప్పారని, ఆయన మాటలు నమ్మి రైతులు అప్పులు చేసి నీళ్లు తోలుకుంటే నేటికీ ఒక్కపైసా కూడా బిల్లులు మంజూరు చేయలేదని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, పుట్టపర్తి పట్టణ, మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, నాయకులు గోవర్దన్‌రెడ్డి, అవుటాల రమణారెడ్డి, నాగమల్లేశ్వర్‌రెడ్డి, షర్ఫుద్దీన్, మాదినేని చెన్నక్రిష్ణ, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.