అంపశయ్యపై కాంగ్రెస్
సాక్షి, ఒంగోలు: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడిపోతున్న క్రమంలో.. ఆ పార్టీ తరఫున జెండా పట్టుకునే వారే కరువయ్యారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రాతినిధ్యం నామమాత్రమే.. పార్టీ సీనియర్లే పక్కకు తప్పుకుంటుండటంతో కేడర్ సైతం కాడి నేలకేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు జిల్లాకొస్తున్నారు. బస్సుయాత్ర పేరిట ఒంగోలులో సోమవారం పర్యటించనున్నారు. సీమాంధ్ర సారథిగా పార్టీ తరఫున మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి ఈ యాత్ర చేయనున్నారు. వారికి స్వాగతం పలికి కండువా కప్పేందుకు జిల్లాలో కార్యకర్తలు కరువయ్యార ని ఇప్పటికే అధిష్టానం గుర్తించింది.
ఈమేరకు చుట్టుపక్కల జిల్లాల కేడర్ కూడా ఇక్కడకొచ్చి ఇంకా పార్టీలో మిగిలిన అరాకొరా కార్యకర్తలతో సమావేశమవుతోంది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్‌ను వీడి జిల్లా నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసి నెగ్గలేమనే భయం కేడర్‌లో నెలకొన్న నేపథ్యంలో... కాంగ్రెస్ పెద్దలు బస్సుయాత్ర పెట్టడం ద్వారా ఒనగూరే ప్రయోజనమేమీ లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.
పరువా..? పరాభవమా..?
సీమాంధ్ర పీసీసీ బాధ్యతలు స్వీకరించిన మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డితో పాటు కేంద్రమంత్రి చిరంజీవి తదితర నేతలు జిల్లాకొచ్చి ఇక్కడి కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తారని డీసీసీ చెబుతున్న మాటలపై జిల్లా శ్రేణులెవరూ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి .. ఇతర పార్టీల ఆహ్వానం కోసం ఎదురుచూస్తూ అభిప్రాయ సేకరణల్లో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేసి, ప్రత్యామ్నాయ రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తుండగా, ఆయన తర్వాత జిల్లా పార్టీని భుజాలకెత్తుకున్న ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జడా బాలనాగేంద్ర సైతం కిరణ్‌పార్టీ కండువా వేసుకున్నారు.
గిద్దలూరు, మార్కాపురం, పర్చూరు, ఒంగోలు, కొండపి, చీరాల, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. మాజీమంత్రి, కందుకూరు ఎమ్మెల్యే ఎం.మహీధర్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఆలోచిస్తూ నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్‌కే పరిమితమవగా, ఇప్పటికే పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో తాను పోటీచేయనని ప్రకటించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ రేపోమాపో మరోపార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కనిగిరి ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి సైతం అవకాశాలుంటే..వలసకు సిద్ధంగా ఉన్నట్లు అనుచరవర్గాల సమాచారం.
ఇక పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిని ఘనశ్యామ్, మరో నేత మంత్రి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌కు అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇటీవల మద్దిపాడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మారం వెంకారెడ్డి కూడా కాంగ్రెస్‌ను కాదని .. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యాలయం ముఖం చూడడం లేదు. అధిష్టాన పెద్దలు జిల్లాకొస్తున్న నేపథ్యంలో వారికి స్వాగతం పలికి పరువు కాపాడాలని ద్వితీయశ్రేణి నేతల్ని ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఫోన్లు చేసి బతిమాలుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
కేంద్రమంత్రులపై జిల్లా జనం భగ్గు..
రాష్ట్ర విభజన బిల్లులో కీలకపాత్ర పోషించి.. సొంత నియోజకవర్గాల్లో తలెత్తుకుని క్యాడర్ ముందు తిరగలేక.. అధిష్టానం పెద్దలతో పాటు జిల్లాకొస్తున్న కేంద్రమంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి పేరెత్తితేనే జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఇటీవల పనబాక లక్ష్మి పలుచోట్ల సమావేశాలు నిర్వహించగా, కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. జిల్లాలోని కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ అంపశయ్యపై ఉందన్న చేదు నిజాన్ని విని అధిష్టాన పెద్దలు ఏవిధంగా జీర్ణించుకుంటారో వేచిచూడాల్సిందే.