చరిత్ర ఓ శిఖరం
జీవన కాలమ్
నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవన సరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది.
135 సంవత్సరాల చరిత్ర ఉన్న మనియార్డర్ కథ ముగిసింది. ఈ మధ్య ఇలాగే టెలిగ్రామ్ వారసత్వమూ ముగిసింది. ఎప్పుడో 1880లో దేశంలో లక్షా 55 వేల పోస్టాఫీసులలో ఈ సౌకర్యాన్ని ఆనాటి ప్రభుత్వం ఏర్పరిచింది.
కొన్ని చరిత్రలకి కాలదోషం పట్టడం కాలధర్మం. మా అమ్మ చెప్పేది. ఆవిడకి పన్నెండో యేట పెళ్లయింది. భర్త దగ్గరకి- అంటే విజయనగరం నుంచి విశాఖపట్నం రావాలి. ఈవిడ పెద్దమ్మాయి. అత్తారింటికి వెళ్లనని ఏడ్చేదట. మా తాతగారు బుజ్జగించి ఓ మిఠాయి పొట్లాం కొనిచ్చి, విజయనగరం రైల్వేస్టేషన్ దాకా ఒంటెద్దు బండి కట్టించి పంపేవారట. విశాఖపట్నంలో విప్పర్తివారి వీధిలో కాపురం. ఆ ఇంట్లోనే మరో కుటుంబం ఉండేది- శ్రీశ్రీ తల్లిదండ్రులు. ఇప్పుడు ఒంటెద్దు బండి దాదాపు చరిత్ర.
నాకు మొదటి కథకి 5 రూపాయలు మనియార్డరు రావడం గుర్తుంది. రెండు కారణాలకి అది పెద్ద జ్ఞాపకం. మొదటి సంపాదన. కథకి రాబడి. ప్రొద్దుటూరులో జూటూరు రమణయ్య గారనే వదాన్యులు, ఆయన నా నాటిక ఏదో చూశారు. ముచ్చటపడి - ఆ నాటికని మెచ్చుకుంటూ నాకు ‘వరుమానంగా’ 15 రూపాయలు మనియార్డరు పంపారు. ఒక ప్రశంసకి మనియార్డరు ఒక అభిమాని పంపడం అదే మొదటిసారి. ఆఖరిసారీను.
‘మనిషికో చరిత్ర’లో నా పేరు పంచముఖాగ్ని హోత్రావధాని. పోచికోలు కబుర్లు చెబుతూ కాలం వెళ్లబుచ్చే తెలివైన సోమరి. భార్య వెంకటలక్ష్మికి మని యార్డరు వస్తుంది. పోస్ట్‌మ్యాన్‌ని నిలదీస్తాడు. ‘వెంకట లక్ష్మి లేదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. అడ్రసు తెలీదు. ఏం చేస్తావ్?’
‘డబ్బు కట్టిన వాళ్లకే పంపించేస్తాం’
‘మరి వాళ్లు కట్టిన చార్జీలు?’
‘డిపార్టుమెంటుకి.’
‘అదెలాగయ్యా? మా డబ్బులు మీ దగ్గర కొంతకాలం మూట కట్టించుకుని మళ్లీ మాకే ఇచ్చెయ్యడానికి మేం చార్జీలు ఇవ్వాలా? బ్యాంకుల్లో వేస్తే వడ్డీ వస్తుంది కదా! రెండూ గవర్నమెంట్ సంస్థలే కదా? పోస్టల్ డిపార్టుమెంటుకి ఒక రూలు, బ్యాంకులకి ఒక రూలా?’
మన తరంలోనే 7 విషయాలు అంతరించాయట. ఇది ఆలోచించాల్సిన విషయం. 1. పోస్టాఫీసు, ఉత్తరాలు, మనీయార్డర్లు, ట్రంక్‌కాల్స్ అవసరాలు తీరి పోయాయి. 2. చెక్కుబుక్కు. ఈ మధ్య ఏదో కంపెనీ ఇంటర్నెట్లో డబ్బు కడితే 20 రూపాయలు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. 3. పుస్తకం. రచయితగా ఈ ఆలోచన బాధగా ఉన్నా మరో రూపంలో రచన జీవిస్తుంది- రాయడానికి కంప్యూటర్, పంపడానికి ఇంటర్నెట్ కాక కనీసం 200 పైచిలుకు పుస్తకాలను దాచుకోవడానికి ‘ఎమెజాన్’ ఉంది. ఇంకా హార్డ్‌కాపీలు, పెన్‌డ్రైవ్‌లూ- మీ ఇష్టం. 4.అమెరికా గ్రంథాలయాల్లో చాలా చోట్ల ఆడియో పుస్తకాలను చూశాను. తెలుగులో మొదటి ఆడియో నవల - నా ‘పిడికెడు ఆకాశం’ని మిత్రులు పెద్దిరెడ్డి గణేశ్‌గారు ప్రచురించారు. తెలుగు చదవడంరాని ఈనాటి చాలామంది తెలుగువారికి ‘ఆడియో’ పెద్ద వరం. 5. టెలిఫోన్ డిపార్టుమెంట్ అవినీతితో, అహంకారంతో దశాబ్దాలుగా బానిసత్వాన్ని అనుభవించిన మనకి ఇంటి ‘ల్యాండ్ టెలిఫోన్’ దరిద్రం వదిలి పోయింది. 6. ఈ తరంలోనే విశ్వరూపం దాల్చిన మరో వినోదం- టెలివిజన్. ఇవాళ ప్రతి సెల్‌ఫోనూ ఒక టెలివిజనే. 7. సంగీత వాద్యాలు. ఇవాళ ఏ వాయిద్యాన్నయినా వాయించగల సింథసైజర్స్ వచ్చేశాయి. ఈ మధ్య పేరూరులో ఒక ఊరేగింపులో నాదస్వరం కచ్చేరీ వినిపించింది. డోలు వాయిస్తున్న వాద్యగాడిని మెచ్చుకోవాలని పరుగెత్తాను. సింథసైజర్ ముందు కూర్చుని కళ్లు తిరిగిపోయేలాగ వాయిస్తున్న క్లారినెట్కి సహకార వాద్యాన్ని అందిస్తున్నాడు.
కోల్పోయే ముఖ్యమైన విషయం- మన ఏకాం తం. ఒక్క ఆధార్ కార్డు చాలు దేశంలో ఎక్కడయినా మన చరిత్రను విప్పడానికి. ఉపగ్రహంతో కనుగొనే సాధనాల ద్వారా విశాఖపట్నంలో మన ఇంటిమీద ఎన్ని పెంకులున్నాయో కెనడాలో కూర్చుని లెక్క పెట్టవచ్చు.
నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవనసరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది. తాతగారు కన్నుమూయడం కాలధర్మం. కాని మనుమడు ఆయన వారసత్వపు మూలాలను నిక్షిప్తం చేస్తూనే కొత్తపుంతలను తొక్కడ మూ కాలధర్మమే అవుతుంది. లేకపోతే మానవుడు ఇప్పటికీ కొండ గుహల్లోనే జీవిస్తూ ఉండేవాడు.
(కొసమెరుపు: ఇంతకీ పోస్టల్ డిపార్టుమెంట్ మనియార్డరు విధానాన్ని నిలిపి వేయలేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ప్రధాన పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ ప్రకటించారు.)