Mobile rythu Bazar
-
రైట్ రైట్.. రైతు బజార్
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కిలోమీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. వీటికి ‘వైఎస్సార్ జనతా బజార్లు’గా నామకరణంచేయనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 52 బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చనున్నారు. వీటిని ఆర్టీసీలో ఇంజనీరింగ్ అధికారులు రూపొందించనున్నారు. లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ మొబైల్ రైతు బజార్లను నగరాలు, పట్టణాల్లో తిప్పింది. ఈ ప్రయోగానికి వినియోగదారుల నుంచి స్పందన రావడంతో ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద ఆర్టీసీ ఆదాయం ఆర్జించేందుకు ఉపకరించడంతో ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖకు సంజీవని బస్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్ రైతు బజార్లు బస్సులను తిప్పేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. లాక్డౌన్లో రూ.కోట్ల ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా... ► స్క్రాప్ కింద ఆర్టీసీ బస్సులను తీసేయకుండా నో కాస్ట్.. నో ప్రాఫిట్ విధానంలో కార్గో బస్సులుగా, మొబైల్ రైతు బజార్లుగా ఇంజనీరింగ్ అధికారులు మార్చారు. ► కరోనా వ్యాప్తి రైతు బజార్లలో, మార్కెట్లలో ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి వినియోగదారుల వద్దకే సరుకులు తీసుకెళ్లనున్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ ఉదంతంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ► లాక్డౌన్ సమయంలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో మొబైల్ బస్సులను తిప్పడంతో ఆదరణ లభించింది. -
స్థలాలు చూపిస్తే రైతు బజార్లు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ప్రస్తుతం 48 ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయాలు విక్రయిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. త్వరలో మరో 52 ప్రాంతాలకు ఈ సేవలను విస్తరింపజేస్తామని చెప్పారు. రహదారులకు సమీపంలో స్థలాలను సమీకరించి ఇస్తే రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మండలిలో సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు కాంగ్రెస్ పాలకులు రాష్ట్రానికి అనుకూలం గా వాదనలు వినిపించకుండా అన్యాయం చేశారని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు ట్రిబ్యునల్తోపాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు. -
సచివాలయంలో సంచార రైతు బజార్
అమరావతి: వెలగపూడి సచివాలయంలో సంచార రైతు బజార్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. సచివాలయం ఉద్యోగుల కోసం వారానికి మూడు రోజుల పాటు ఈ సంచార రైతు బజార్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయం పట్ల మహిళా ఉద్యోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.2.5 లక్షలతో కూరగాయల వాహనం కొనుగోలుకు వడ్డీ లేని రుణంతో ఐదేళ్ల కాల పరిమితితో చెల్లించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని పుల్లారావు తెలిపారు.