Mobiles sales
-
బిగ్–సి మరో 150 స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయాల్లో ఉన్న బిగ్–సి వచ్చే రెండేళ్లలో రూ.300 కోట్లతో కొత్తగా 150 ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కంపెనీకి 250 స్టోర్లున్నాయి. 2023–24లో టర్నోవర్ 50 శాతం వృద్ధితో రూ.1,500 కోట్లు లక్ష్యంగా చేసుకున్నామని బిగ్–సి ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. కంపెనీ రెండు దశాబ్దాల వేడుకల్లో భాగంగా బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబుతో కలిసి ఈడీ వై.స్వప్న కుమార్, డైరెక్టర్లు జి.బాలాజీ రెడ్డి, ఆర్.గౌతమ్ రెడ్డి, కైలాశ్ లఖ్యానితో కలిసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘2002 డిసెంబర్ 23న బిగ్–సి మొదలైంది. మొబైల్స్ రిటైల్‌లో తెలంగాణ, ఏపీలో తొలి స్థానంలో నిలిచి రెండు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. మూడవ దశాబ్దంలోనూ అగ్ర స్థానాన్ని కొనసాగిస్తాం. 3 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మరిన్ని ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్‌ను జతచే స్తాం. 1,500 మందిని కొత్తగా నియమించుకోవడం ద్వారా సిబ్బంది సంఖ్య రెండేళ్లలో 4,000లకు చేరుతుంది. ఒక్కో కుటుంబంలో మూడు తరాలకు సేవలు అందిస్తున్నాం’ అని చెప్పారు. మహేశ్‌బాబుతో గౌతమ్ రెడ్డి, స్వప్న కుమార్, బాలు చౌదరి, బాలాజీ రెడ్డి, కైలాశ్ లఖ్యాని (ఎడమ నుంచి) -
5జీ స్మార్ట్ఫోన్లదే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరందుకున్నాయి. 2021తో పోలిస్తే గతేడాది 5జీ మోడళ్ల అమ్మకాలు 74 శాతం అధికం అయ్యాయి. కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ 5జీ స్మార్ట్ఫోన్ల విలువ సుమారు రూ.1.65 లక్షల కోట్లు ఉంటుందని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తన నివేదికలో వెల్లడించింది. కఠినమైన మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో 2022లో మొత్తం మొబైల్స్ సేల్స్ 17 శాతం, స్మార్ట్ఫోన్ల విక్రయాలు 8 శాతం తగ్గడం గమనార్హం. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 28 శాతం క్షీణించింది. 2023లో స్మార్ట్ఫోన్ల పరిశ్రమ చక్కటి వృద్ధి తీరుతో 16–16.5 కోట్ల యూనిట్లు ఉండే వీలుంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. మరోవైపు రూ.1 లక్ష ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం విభాగం ఏకంగా 95 శాతం దూసుకెళ్లిందని సీఎంఆర్ వెల్లడించింది. రూ.7 వేల లోపు ధర ఉండే మొబైల్స్ సేల్స్ గతేడాది 55 శాతం తగ్గాయి. సరఫరా సమస్యలు, ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణం. రూ.7–25 వేల ధరల శ్రేణిలో విక్రయాలు 8 శాతం క్షీణించాయి. రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య ఉండే ప్రీమియం మోడళ్ల అమ్మకాలు 12 శాతం, రూ.50,000 నుంచి రూ.1 వరకు ఉండే సూపర్ ప్రీమియం 41 శాతం దూసుకెళ్లాయి. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో యాపిల్ వాటా 4 శాతం. గతేడాది ఈ సంస్థ 17 శాతం వృద్ధి నమోదు చేసింది. యాపిల్ విక్రయాల్లో రూ.50,000–1,00,000 ధరల శ్రేణి మోడళ్ల వాటా 79 శాతం ఉంది. -
బిగ్ సి సంక్రాంతి పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ రీటైల్ విక్రయ సంస్థ బిగ్ సి కస్టమర్లకు కోసం సంక్రాంతికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సందర్భంగా మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నామని బిగ్ సి వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. మొబైళ్ల కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్‌పై కచ్చితమైన బహుమతి, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నామన్నారు. అమెజాన్ పే, డెబిట్‌కార్డు, పేటియం మాల్ ద్వారా కొనుగోళ్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
అమెజాన్ మరో సేల్..! మొబైల్స్‌పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్ల కోసం అమెజాన్ ఇండిపెండెన్స్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై ఇతర మొబైల్ యాక్సెసరీలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. మొబైల్ కొనుగోళ్లపై పన్నెండు నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్ఐలను అమెజాన్ ఇవ్వనుంది. పలు మొబైల్ కొనుగోళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ డీల్స్‌ను కూడా అమెజాన్ తన కస్టమర్లకు అందించనుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలుదారులకు 10 శాతం సుమారు రూ. 1250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా 'అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్' ప్లాన్ కింద ప్రైమ్ కస్టమర్లకు ఆరునెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, హెచ్డీఎఫ్సీ కార్డులపై మూడు నెలల అదనపు నో కాస్ట్ ఈఎమ్ఐ వంటి అదనపు ఆఫర్లను అమెజాన్ అందిస్తుంది. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ భాగంగా వన్‌ప్లస్ ,షావోమీ , శాంసంగ్ , ఐక్యూ , రియల్మీ కంపెనీల స్మార్ట్ఫోన్లపై సుమారు 10 శాతం తగ్గింపు ధరను అమెజాన్ ప్రకటించింది. వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవ్వనుంది. ఈ మొబైల్ కొనుగోలుపై సుమారు రూ .4000 వరకు డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కూపన్రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై పన్నెండు నెలల నో కాస్ట్ ఈఎమ్ఐతో పాటు అదనంగా రూ. 3000 డిస్కౌంటును పొందవచ్చును. ఎమ్ఐ 11 ఎక్స్ కొనుగోలు ఎక్సేచేంజీ పై అదనంగా రూ. 5,000 తగ్గింపును అందిస్తుంది. మొబైల్ యాక్సెసరీస్ ప్రారంభ ధర రూ. 69 కాగా పవర్ బ్యాంకులు రూ.399 నుంచి ప్రారంభంకానున్నాయి. -
గంటలో మొబైల్ ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కారణంగా దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఏప్రిల్–జూన్ కాలంలో మొబైల్స్ అమ్మకాలు 50 శాతం తగ్గాయని ఐడీసీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌తో అమ్మకాలు లేక అద్దెలు, వేతనాల భారం కారణంగా ఆఫ్‌లైన్ రిటైల్ చైన్లు నష్టపోయాయి. అయితే ఈ నష్టాన్ని పూరించుకోవడానికి మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్స్ ఆన్లైన్ సేల్స్‌ను ఆసరాగా చేసుకున్నాయి. చిన్న పట్టణాల్లోనూ స్టోర్లు, సొంత నెట్వర్క్ ఉండడం వీటికి కలిసి వస్తోంది. ఈ–కామర్స్‌కు ధీటుగా ఇవి పోటీకి సై అంటున్నాయి. ఔట్లెట్లు ఉన్న ప్రాంతాల్లో ఒక గంటలోనే మొబైల్‌ను డెలివరీ చేసి కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. అంతేకాదు ఈ–కామర్స్ కంపెనీలు ఎంతకైతే విక్రయిస్తున్నాయో అదే ధరను ఇవి కూడా ఆఫర్ చేస్తున్నాయి. మార్చి ముందుతో పోలిస్తే రిటైల్ చైన్ల ఆన్లైన్ అమ్మకాలు ఇప్పుడు గణనీయంగా అధికం కావడం విశేషం. కోవిడ్‌కు ముందు కొన్ని నగరాల్లో ఈ–కామర్స్ కంపెనీలు 24 గంటల్లో మొబైల్స్‌ను డెలివరీ చేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చిన్న పట్టణాల్లోనూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ సి, లాట్, బి న్యూ, హ్యాపీ, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ తమ స్టోర్లతో విస్తరించాయి. బిగ్ సి 225 కేంద్రాలు, లాట్ 125, బి న్యూ 75, హ్యాపీ 70, సెలెక్ట్ 70 ఔట్లెట్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు ఇవి స్టోర్ ఉన్న ప్రాంతాల్లో గంటలోనే మొబైల్‌ను అందిస్తున్నాయి. 50 కిలోమీటర్ల లోపు డెలివరీని 90–120 నిముషాల్లోనే పూర్తి చేస్తున్నాయి. కరోన ముందు వరకు అంతంతే నమోదైన ఆన్లైన్ సేల్స్ ఇప్పుడు 10–20 శాతానికి చేరాయని ‘బిగ్ సి’ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా ఏకంగా 50 శాతం ఉందని చెప్పారు. 5 శాతంగా ఉన్న ఆన్లైన్ సేల్స్ ఇప్పుడు 25 శాతానికి వచ్చాయని ‘బి న్యూ’ ఫౌండర్ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. డిసెంబరుకల్లా ఇది 40 శాతానికి వెళ్తుందన్నారు. ఆన్లైన్ సేల్స్ వేగంగా పుంజుకున్నాయని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. ఈ వారం మరో అయిదు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. మార్చికి ముందు 2 శాతంగా ఉన్న ఆన్లైన్ వాటా ఇప్పుడు 10 శాతానికి ఎగసిందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ పేర్కొన్నారు. సర్వీస్ సపోర్ట్, యాక్సెసరీస్, బీమా సేవలూ కస్టమర్లు అందుకోవచ్చన్నారు. ట్యాబ్లెట్ పీసీల జోరు.. ప్రపంచవ్యాప్తంగా ట్యాబ్లెట్ పీసీలకు మళ్లీ జీవం వచ్చింది. 2020 ఏప్రిల్–జూన్‌లో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైందని పరిశోధన సంస్థ కెనలిస్ వెల్లడించింది. మొత్తం 3.75 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఆపిల్ 38 శాతం, శామ్సంగ్ 18.7, హువావే 12.7 శాతం వాటా దక్కించుకున్నాయి. అమెజాన్, లెనోవో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో అల్కాటెల్, సెల్కాన్, లావా వంటి కంపెనీలు కూడా ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. దేశంలో రిటైల్ స్టోర్లలో మార్చికి ముందు ఒక శాతంగా ఉన్న ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు నేడు 20 శాతానికి చేరాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆన్లైన్ క్లాసులు అధికం కావడంతో వీటికి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. ట్యాబ్లెట్స్కు దిగుమతి సుంకం లేకపోవడం కస్టమర్లకు ప్రయోజనంగా ఉంది. -
డిష్ వాష్ కరోనా!
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్తే మొహానికి మాస్కు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. శానిటైజర్ రాసుకోవడం... కరోనా కట్టడి కోసం ఇప్పుడు మనమంతా చేస్తున్న పని. ఇంతవరకు బాగానే ఉంది. మరి నిత్యం గిన్నెలు తోమేందుకు ఇళ్లకు వచ్చే పనిమనుషులు మనలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తెలి యదు. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది పనిమనుషులను దూరం పెట్టారు. మరి వారు రాకుండా ఎంతకాలం నెట్టుకురాగలరు? ఇందుకు వారికి లభించిన సమాధానమే డిష్ వాషర్. లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు డిష్ వాషర్ల కొనుగోలు కోసం ఎలక్ట్రానిక్ షోరూంలకు వెళ్తున్నారు. ల్యాప్‌టాప్‌లకూ పెరిగిన గిరాకీ... కరోనా ఇప్పట్లో వదిలే అవకాశం లేక పోవడంతో విద్యా సంస్థలు ఆన్లైన్ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఇందుకు అనువుగా ఉండే ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కోసం తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్ షోరూంలకు అధికంగా వెళ్తున్నారు. ‘‘లాక్డౌన్ కంటే ముందు మా షోరూంకు నిత్యం 60 నుంచి 70 మంది వచ్చే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటుతోంది. ఏసీలు, టీవీలు, కూలర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు కొంటున్నారు. ఇప్పుడు సరి–బేసి విధానం వల్ల కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోందా తగ్గుతోందా అనేది ఇంకా అంచనా వేయాల్సి ఉంది. మరో వారం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జనం భయం వదిలి కొనుగోలుకు ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అని మరో ప్రధాన షోరూం నిర్వాహకుడు పేర్కొన్నారు. తెలియని వస్తువే అయినా... డిష్ వాషర్ సాధారణ కుటుంబాలకు అంతగా పరిచయం లేనిది. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ వాడకం సాధారణమే కానీ డిష్ వాషర్ పేరు వినడమే ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇది గిన్నెలు తోమే యం త్రం. వాషింగ్ మెషీ న్లలో బట్టలు, వాషింగ్ పౌడర్ వేసి సమయం సెట్ చేస్తే దాని పని ఎలా చేసుకుంటూ వెళ్తుందో అదే తరహాలో డిష్ వాషర్ కూడా పనిచేస్తుంది. పళ్లాలు, గిన్నె లు, గ్లాసులను వాటి సైజుల ప్రకారం యంత్రంలో ఉంచి లిక్విడ్ డిటెర్జంట్ వేసి సమయం నిర్దేశిస్తే చాలు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య డిష్ వాషర్ల ధర పలుకు తోంది. సైజు, నాణ్యత, కంపెనీల ఆధారంగా ధరల్లో తేడాలున్నాయి. ఇంటిల్లి పాదీ బోళ్లు తోమేం దుకు ఇది అనుకూలంగా ఉండటంతో వాటిని కొనే స్తోమత ఉన్న వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ‘గతంలో నెలలో మేం 7–8 వరకు వీటిని అమ్మే వాళ్లం. కానీ ఇప్పుడు లాక్డౌన్ సడలించిన తర్వాత గత మూడు నాలుగు రోజుల్లో 10 వరకు అమ్మేశాం. త్వరలో వీటి కొనుగోళ్లు మరింత పెరుగుతాయి’ అని నగరంలో ఓ ప్రధాన ఎలక్ట్రానిక్ షోరూం ఇన్చార్జి పేర్కొన్నారు. ఇక వాషింగ్ మెషీన్ల కొనుగోలు కూడా గతంతో పోలిస్తే పెరిగింది. -
లక్ష జనాభా ఉంటే ‘బీ న్యూ’ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ విక్రయంలో ఉన్న ‘బీ న్యూ’ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగా వారానికి ఒక స్టోర్ తెరుస్తోంది. ప్రస్తుతం సంస్థకు 49 కేంద్రాలు ఉన్నాయి. ఈ వారం 50వ ఔట్‌లెట్‌ను విజయనగరంలో ప్రారంభిస్తోంది. కొద్ది రోజుల్లో కరీంనగర్, గుడివాడ, ప్రొద్దుటూరులో అడుగు పెడుతోంది. డిసెంబరులోగా తెలంగాణలో 60 స్టోర్లు రానున్నాయని ‘బీ న్యూ’ మొబైల్స్ వ్యవస్థాపకులు వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ఇందులో సగం హైదరాబాద్‌లో ఉంటాయని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మరో 25 ఔట్లెట్లు ప్రారంభిస్తామని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డిసెంబరుకల్లా మొత్తం 135 కేంద్రాలను దాటు తామన్నారు. కంపెనీ విస్తరణ, భవిష్యత్ ప్రణాళిక ఆయన మాటల్లోనే.. విద్యార్థుల కోసం గ్యాడ్జెట్లు.. బీ న్యూ ఔట్లెట్లలో అన్ని ప్రముఖ కంపెనీల మొబైళ్లు, ట్యాబ్లెట్ పీసీలు, యాక్సెసరీస్ విక్రయిస్తున్నాం. త్వరలో ల్యాప్టాప్స్ అమ్మకాల్లోకి అడుగు పెట్టబోతున్నాం. అలాగే పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాం. దేశంలో ఏ కొత్త ఉత్పాదన వచ్చినా ప్రజలకు అందిస్తున్నాం. పాఠశాలల్లో డిజిటల్ బోధనకు ఉపయోగపడే ఎల్ఈడీ ప్రొజెక్టర్లు అందుబాటు ధరలో పరిచయం చేయబోతున్నాం. వినూత్న గ్యాడ్జెట్ల సేకరణలో మా టీమ్ నిమగ్నమైంది. సర్వీస్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రిపేర్ అదేరోజు గనక కాకపోతే కస్టమర్‌కు స్టాండ్ బై ఫోన్ ఇచ్చేలా బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతి మొబైల్‌పై బహుమతి.. మా ఔట్లెట్లలో రూ.499తో మొదలై రూ.1 లక్ష విలువ చేసే మోడళ్లనూ అమ్ముతున్నాం. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక బహుమతి ఖచ్చితంగా అందిస్తున్నాం. సీజన్నుబట్టి స్కూల్ బ్యాగ్ వంటి గిఫ్టులు ఇస్తున్నాం. ప్రస్తుతం రూ.1,599 విలువ చేసే మొబైల్‌పై టేబుల్ ఫ్యాన్ ఉచితంగా అందజేస్తున్నాం. వినియోగదార్ల సౌకర్యార్థం ప్రతి స్టోర్‌లో 100 మోడళ్ల వరకు డిస్ప్లే ఉంచుతున్నాం. ప్రస్తుతం నెలకు 50,000 యూనిట్ల ఫోన్లు అమ్ముతున్నాం. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 75 శాతముంది. ఒక్కో స్టోర్ ప్రాంతాన్ని బట్టి 500 నుంచి 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. రెండు రెట్ల టర్నోవర్.. బాలాజీ వాచ్ కంపెనీ పేరుతో నెల్లూరులో 1990లో రిటైల్‌లో అడుగు పెట్టాం. రిటైల్‌లో 28 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్‌లో మొబైల్స్ ప్రవేశించిన నాటి నుంచే ఈ రంగంలో ఉన్నాం. ప్రముఖ బ్రాండ్ల సూపర్ డిస్ట్రిబ్యూషన్ సైతం చేపట్టాం. 2014లో ‘బీ న్యూ’కు శ్రీకారం చుట్టాం. తొలి కేంద్రం విజయవాడలో ప్రారంభించాం. 2017లో ఏకంగా 30 స్టోర్లు తెరిచాం. ఇప్పటి వరకు తెలంగాణలోని హన్మకొండ మినహా మిగిలిన ఔట్‌లెట్లన్నీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయి. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశాం. లక్ష జనాభా ఉన్నచోట స్టోర్‌ను అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం. విస్తరణతో 2018–19లో టర్నోవర్ రెండింతలకు చేరుకుంటుంది. 2019లో కర్ణాటకలో అడుగు పెట్టాలని నిర్ణయించాం. సంస్థ వద్ద 600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
మొబైల్స్ రిటైల్‌లోకి ‘సెలెక్ట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయ రంగంలోకి మరో కొత్త బ్రాండ్ ప్రవేశిస్తోంది. సెలెక్ట్ పేరుతో దేశవ్యాప్తంగా మల్టీ బ్రాండెడ్ ఫోన్లను విక్రయించే స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఈ హైదరాబాద్ కంపెనీ రెడీ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త, యాక్సెసరీస్, మొబైల్స్ రిటైల్ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవమున్న వై.గురు సెలెక్ట్‌కు సారథ్యం వహిస్తున్నారు. మార్చి 15న తొలి ఔట్లెట్ భాగ్యనగరిలో ప్రారంభం కానుంది. మార్చి ఆఖర్లోగా తెలంగాణలో 23, తిరుపతిలో రెండు స్టోర్లను తెరుస్తామని సెలెక్ట్ ఎండీ వై.గురు శుక్రవారమిక్కడ విలేకరులకు తెలియజేశారు. అన్ని ప్రముఖ కంపెనీల స్మార్ట్, బేసిక్ ఫోన్లను ఈ ఔట్లెట్లలో విక్రయిస్తారు. సెలెక్ట్‌ను జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఎక్స్‌పీరియెన్స్ జోన్లు.. సెలెక్ట్ ఔట్లెట్లలో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియెన్స్ జోన్లను ఏర్పాటు చేస్తారు. ‘ఫోన్ ఫీచర్లను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా భారత్‌లో తొలిసారిగా వినూత్న ఎక్స్‌పీరియెన్స్ అందుబాటులోకి తెస్తున్నాం. ఫీచర్లను వివరించేందుకు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తాం. కెమెరా పనితీరూ చూడొచ్చు. ఫీచర్లను వినియోగదార్లకు వివరించేందుకు ప్రత్యేక నిపుణులుంటారు. ఆన్లైన్, లార్జ్ ఫార్మాట్ స్టోర్లతో పోలిస్తే పోటీ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తాం. అన్ని మోడళ్లకు యాక్సెసరీస్ అందుబాటులో ఉంచుతాం. విభిన్న ఉపకరణాలూ కొలువుదీరతాయి. పెద్ద స్టోర్లలో సర్వీసింగ్ ఉంటుంది’ అని గురు వివరించారు. తొలి దశలో రూ.200 కోట్లు... తెలంగాణతో ప్రారంభమై దేశవ్యాప్తంగా సెలెక్ట్ ఔట్లెట్లను విస్తరించనున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది మార్కెట్లలో లార్జ్ ఫార్మాట్ రిటైల్ చైన్లను విజయవంతంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది. మొత్తంగా రూ.200 కోట్ల ఖర్చుతో రెండేళ్లలో 500 స్టోర్లు రానున్నాయి. తొలి దశ పూర్తయితే సుమారు 3,500 మంది యువతకు ఉపాధి లభిస్తుంది. అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే వీరిని ఎంపిక చేస్తారు. ఇక ప్రాంతాన్నిబట్టి 500 నుంచి 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్లు ఉంటాయి. ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.30–90 లక్షలు ఖర్చు అవుతుంది. రెండో దశలో మరో 500 కేంద్రాలు నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. ఈ 1,000 కేంద్రాలు కార్యరూపంలోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 150 దాకా ఉంటుందని అంచనా. -
మొబైల్.. ఇండియా!
భూమి తన చుట్టూ తాను తిరుగుతోందన్నది ఎంత నిజమో... ఇపుడు మొబైల్ ఫోన్ చుట్టూ తిరుగుతోందన్నది కూడా అంతే నిజం. ఈ-కామర్స్, స్టార్టప్‌లు, గేమింగ్, టెలికం, ఇంటర్నెట్... ఇలా ఏ రంగమైనా మొబైల్ చుట్టూనే తిరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇది మనిషికిపుడు కనిపించే గుండెకాయ. ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేని పరిస్థితి. అందుకే... ఇది మొబైల్ నామ సంవత్సరం. ఈ ఒక్క ఏడాదే కాదు. మరికొన్నేళ్లు ఈ మొబైల్ మేనియాకు అడ్డుండదు. దేశంలో 80 కోట్లు దాటేసిన మొబైల్ ఫోన్లు ⇒ 180కి పైగా బ్రాండ్లు; 2,700కు పైగా మోడళ్లు ⇒ రెండేళ్లలో విక్రయాల్లో చైనా తర్వాతి స్థానంలోకి ⇒ రూ.10 వేల లోపు మొబైల్స్‌లోనూ బోలెడు ఫీచర్లు ⇒ తయారీలోకి పలు కంపెనీల ప్రవేశం ⇒ 2016లోనూ కొనసాగనున్న మొబైల్స్ అమ్మకాల జోరు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫోకస్, డాజెన్, మీజు, వివో, నుబియా, ఓబి, ఫికామ్, బ్లూ... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? శామ్సంగ్, యాపిల్‌కు దాయాదులు. ఇవే కాదు. దేశీయంగా ఒక స్థాయిని సంతరించుకున్న కంపెనీల్లో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, సెల్కాన్, కార్బన్... ఇలా చాలానే ఉన్నాయి. మొత్తంగా మన మార్కెట్లో ఇపుడు 180కి పైగా బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. ‘‘భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగం ఏ స్థాయిలో ఉందంటే... దీన్నిపుడు ఏ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కంపెనీ విస్మరించే సాహసం చేయలేకపోతోంది’’ అనేది స్ట్రాటజీ అనలిటిక్స్ మాట. అందుకేనేమో! గతంలో అమ్మకాలకే పరిమితమైన కంపెనీలిపుడు తయారీకి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఫీచర్ఫోన్లు వాడుతున్న 8 కోట్ల మంది 2016లో స్మార్ట్ఫోన్లకు మళ్లుతారనే అంచనాలున్నాయి. ‘‘ఇండియా అనేది ఓపెన్ మార్కెట్. అందుకే కంపెనీలిక్కడకు వస్తున్నాయి’’ అనేది కార్బన్ మాట. ఫాక్స్‌కాన్ వంటి కాంట్రాక్ట్ తయారీ దిగ్గజాలు భారత మార్కెట్లో అడుగు పెట్టడం ఈ రంగ కంపెనీలకు కలిసి రానుంది. ‘స్మార్ట్’ వాటాయే అధికం... ఇండియాలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ కలిపి 2,700లకుపైగా మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1,900పైగా స్మార్ట్ఫోన్లే. అందులోనూ రూ.10 వేల లోపువి 1,500 పైనే. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో గ్రామాలు, మండలాలకు 33 శాతం వాటా ఉంది. ఆన్లైన్లో మాత్రమే అమ్ముతున్న ఎక్స్‌క్లూజివ్ మోడళ్ల వాటా 17 శాతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2015లో అమ్ముడైన స్మార్ట్ఫోన్ల సంఖ్య దాదాపు 150 కోట్లు. 2017 నాటికి ఇది 170 కోట్లకు చేరుతుంది. చైనా తర్వాత అమెరికా మార్కెట్‌ను తోసి రెండో స్థానానికి భారత్ ఎగబాకుతుందని స్ట్రాటజీ అనలిటిక్స్ చెబుతోంది. దీని ప్రకారం 2015లో 11.8 కోట్లు, 2017లో 17.4 కోట్ల స్మార్ట్ఫోన్లు భారత్‌లో విక్రయమవుతాయి. 2017లో చైనాలో 50 కోట్లు, అమెరికాలో 16.9 కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. దేశంలోని కస్టమర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల సంఖ్య 80 కోట్లను దాటినట్టు అంచనా. దిగి వచ్చిన ధరలు... ఖరీదైన ఫోన్లకే పరిమితమైన ఫీచర్లు రూ.10 వేల లోపు మోడళ్లలోకీ వచ్చేశాయి. 3జీబీ ఆపైన ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఫుల్ హై డెఫినిషన్ స్క్రీన్, అమోలెడ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, షార్ప్ డిస్ప్లే, 12 ఎంపీ ఆపైన సామర్థ్యంగల కెమెరా, 8 ఎంపీ ఆపైన ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ ఫ్లాష్, ఫ్రంట్ ఆటో ఫోకస్, 1.4 ఆపైన గిగాహెట్జ్ ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటివన్నీ ఈ ఫోన్లలో ఉంటున్నాయి. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్‌ప్రూఫ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లతో కంపెనీలు పోటీపడుతున్నట్లు ‘లాట్’ మొబైల్స్ ఈడీ కృష్ణపవన్ చెప్పారు. 2014లో సగటు 4జీ మొబైల్ ధర రూ.25 వేలుంటే ఇప్పుడది రూ.5 వేలకు దిగింది. స్టేటస్ కోసం తప్ప మిగతా వారంతా రూ.25 వేలు పైబడ్డ ఫోన్లను కొనటం మానేశారని ‘టెక్నోవిజన్’ ఎండీ సికిందర్ చెప్పారు. రూ.50 వేల ఫోన్లలో ఉండే ఫీచర్లు రూ.15 వేల ఫోన్లలోకీ వచ్చేశాయన్నారు. ఆన్‌లైన్‌కు పోటీగా రిటైల్.. ఒకప్పుడు భారీ డిస్కౌంట్లంటూ ప్రచారం చేసుకున్న ఈ-కామర్స్ కంపెనీల మాట మారింది. కస్టమర్లు సౌలభ్యం చూస్తున్నారని, అందుకే ఆన్లైన్ అమ్మకాలు పెరుగుతున్నాయని ఇప్పుడు చెబుతున్నాయి. ఆఫ్‌లైన్ విక్రేతల నుంచి వచ్చిన ఒత్తిడితో కొన్ని కంపెనీలు ఆన్లైన్ కోసం ప్రత్యేక మోడళ్లను తయారు చేస్తున్నాయి. కొన్నయితే ఆన్‌లైన్‌కే పరిమితమవుతున్నాయి. నిజానికి ఆన్లైన్ కంటే ఇపుడు ఆఫ్‌లైన్‌లోనే మొబైల్స్ చవకగా లభిస్తున్నాయని బిగ్ిసీ చైర్మన్ బాలు చౌదరి చెప్పారు. ‘‘కస్టమర్లు చాలా తెలివైనవారు. ఎక్కడ తక్కువకిస్తే అక్కడే కొంటారు. ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ఆఫ్‌లైన్ బాట పడుతున్నారు’’ అన్నారు. భారీ విస్తరణకు చాన్స్... దేశంలో స్మార్ట్ఫోన్లు వాడుతున్నది 13 శాతమే కావటంతో... ఇక్కడ విస్తరణకు భారీ అవకాశాలున్నట్లు శామ్సంగ్ ఐటీ, మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి చెప్పారు. జనాభా వారీగా చూస్తే చైనాలో 42, రష్యాలో 41, బ్రెజిల్లో 24% మంది వద్ద స్మార్ట్ఫోన్లున్నాయి. భారత్‌లో 30 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. వీరిలో మొబైల్ ద్వారా నెట్‌ను వాడుతున్నవారి సంఖ్య 25 కోట్లు. ప్రీమియం మోడళ్ళ ‘ఆపిల్’ ఆదాయం భారత్‌లో 2009-10లో రూ.450 కోట్లు మాత్రమే. 2014-15లో ఇది రూ.6,300 కోట్లకు ఎగియడం మన మార్కెట్ జోరుకు నిదర్శనం. బంగారు, రోజ్ గోల్డ్ వర్ణంలో వచ్చిన ఆపిల్ ఫోన్లను రూ.1 లక్షకుపైగా వెచ్చించి మరీ బ్లాక్ మార్కెట్లో కొన్నారంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్ 4జీ మోడళ్లదే.. మొబైల్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నది ఆన్లైన్లో యాక్టివ్‌గా ఉన్న 15-25 ఏళ్ల యువతనే. వినూత్న ఫీచర్లతో, అందుబాటు ధరలో మోడళ్లను తేవటం ద్వారా ఇవి విజయవంతమవుతున్నాయి. లక్షల రిటైల్ దుకాణాలు దేశమంతా విస్తరించినా ఆన్లైన్ అమ్మకాలు పెరగటానికి కారణమిదే. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ వాటా 30 శాతం ఉందంటే వీరి వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ వాటా మార్చికల్లా 35 శాతానికి చేరుతుందని అంచనా. 2015-16లో 13 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని యూ టెలివెంచర్స్ సీవోవో అమరీందర్ ధలివాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వీటిలో 4జీ వేరియంట్ల వాటా 40%. తయారీలోనూ పోటీ.. చైనాలో తయారీ వ్యయం పెరగటంతో మొబైల్ ఫోన్ కంపెనీలు ఇతర దేశాలవైపు దృష్టిసారించాయి. వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్ సహజంగానే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మేకిన్ ఇండియా ఆకర్షణతో విదేశీ దిగ్గజాలకుతోడు దేశీ బ్రాండ్లూ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే శ్రీసిటీలో ఫాక్స్‌కాన్ భారీ యూనిట్లు నిర్మించింది. సెల్కాన్ చొరవతో హైదరాబాద్, తిరుపతిల్లో మొబైల్ తయారీ హబ్‌లు ఏర్పాటవుతున్నాయి. మైక్రోమ్యాక్స్, లావా, ఇంటెక్స్, కార్బన్, షావొమీ, ఇన్ఫోకస్, జియోనీ, వన్‌ప్లస్ వంటి కంపెనీలు భారత్‌లోనే తయారీ చేపడుతున్నాయి. అమ్ముడవుతున్న ఫోన్లలో 30 శాతం దేశీయంగా తయారీ లేదా అసెంబుల్ అయినవే.