హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయ రంగంలోకి మరో కొత్త బ్రాండ్ ప్రవేశిస్తోంది. సెలెక్ట్ పేరుతో దేశవ్యాప్తంగా మల్టీ బ్రాండెడ్ ఫోన్లను విక్రయించే స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఈ హైదరాబాద్ కంపెనీ రెడీ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త, యాక్సెసరీస్, మొబైల్స్ రిటైల్ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవమున్న వై.గురు సెలెక్ట్‌కు సారథ్యం వహిస్తున్నారు.
మార్చి 15న తొలి ఔట్‌లెట్ భాగ్యనగరిలో ప్రారంభం కానుంది. మార్చి ఆఖర్లోగా తెలంగాణలో 23, తిరుపతిలో రెండు స్టోర్లను తెరుస్తామని సెలెక్ట్ ఎండీ వై.గురు శుక్రవారమిక్కడ విలేకరులకు తెలియజేశారు. అన్ని ప్రముఖ కంపెనీల స్మార్ట్, బేసిక్ ఫోన్లను ఈ ఔట్‌లెట్లలో విక్రయిస్తారు. సెలెక్ట్‌ను జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఎక్స్‌పీరియెన్స్ జోన్లు..
సెలెక్ట్ ఔట్‌లెట్లలో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియెన్స్ జోన్లను ఏర్పాటు చేస్తారు. ‘ఫోన్ ఫీచర్లను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా భారత్‌లో తొలిసారిగా వినూత్న ఎక్స్‌పీరియెన్స్ అందుబాటులోకి తెస్తున్నాం. ఫీచర్లను వివరించేందుకు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తాం. కెమెరా పనితీరూ చూడొచ్చు. ఫీచర్లను వినియోగదార్లకు వివరించేందుకు ప్రత్యేక నిపుణులుంటారు.
ఆన్‌లైన్, లార్జ్ ఫార్మాట్ స్టోర్లతో పోలిస్తే పోటీ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తాం. అన్ని మోడళ్లకు యాక్సెసరీస్ అందుబాటులో ఉంచుతాం. విభిన్న ఉపకరణాలూ కొలువుదీరతాయి. పెద్ద స్టోర్లలో సర్వీసింగ్ ఉంటుంది’ అని గురు వివరించారు.
తొలి దశలో రూ.200 కోట్లు...
తెలంగాణతో ప్రారంభమై దేశవ్యాప్తంగా సెలెక్ట్ ఔట్‌లెట్లను విస్తరించనున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది మార్కెట్లలో లార్జ్ ఫార్మాట్ రిటైల్ చైన్లను విజయవంతంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది. మొత్తంగా రూ.200 కోట్ల ఖర్చుతో రెండేళ్లలో 500 స్టోర్లు రానున్నాయి. తొలి దశ పూర్తయితే సుమారు 3,500 మంది యువతకు ఉపాధి లభిస్తుంది.
అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే వీరిని ఎంపిక చేస్తారు. ఇక ప్రాంతాన్నిబట్టి 500 నుంచి 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్లు ఉంటాయి. ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.30–90 లక్షలు ఖర్చు అవుతుంది. రెండో దశలో మరో 500 కేంద్రాలు నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. ఈ 1,000 కేంద్రాలు కార్యరూపంలోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 150 దాకా ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment